
జిల్లా కార్యాలయం జప్తుచేయండి
జనగామ: జనగామ జిల్లా వ్యవసాయశాఖ నిర్లక్ష్యంపై జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొమ్మిదేళ్లుగా బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేయడంపై ఆ శాఖ కార్యాలయ ఫర్నిచర్ జప్తునకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్, వెల్డింగ్ వర్క్స్ కంపెనీలో వ్యవసాయ సంబంధిత పరికరాలు తయారు చేస్తారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు రాయితీ పరికరాల సరఫరా కోసం సదరు యజమాని రాజిరెడ్డి కాంట్రాక్టు దక్కించుకున్నారు. కల్టివేటర్లు, ఫ్లవ్‌లు, రొటోవేటర్లు తదితర పరికరాలను తయారు చేసి జిల్లా వ్యవసాయ శాఖకు అందజేశారు. 2016–17 సంవత్సరం నాటికి వ్యవసాయ శాఖ యజమానికి రూ.5.25 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే అప్పటి అధికారులు బిల్లు చెల్లించకపోవడంతో కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ పరిధిలోని సమాధాన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశ్రమల శాఖ స్పందించి చెల్లింపునకు హామీ ఇచ్చినా వ్యవసాయ శాఖ బిల్లు విడుదల చేయలేదు. ఎన్నిసార్లు అధికారులు, ఉన్నతాధికారుల వద్ద తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో 2022 డిసెంబర్‌లో బాధితుడు జనగామ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఈ ఏడాది ఆగస్టు 5న వ్యవసాయ శాఖ అధికారులు రూ.5.25 లక్షల బిల్లు, మూడింతల వడ్డీ కలుపుకుని రూ.13,19,428తో కలిపి మొత్తం రూ.18,44,928 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయినా చెల్లింపు జరగకపోవడంతో కోర్టు అటాచ్‌మెంట్ వారెంట్ జారీ చేసి కార్యాలయ సామగ్రిని జప్తు చేసుకోవాలని సూచించింది. దీంతో గురువారం కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ పూల్‌చంద్ సమక్షంలో యజమాని కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి అంబికాసోని, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్ యజమానితో చర్చించి మూడు నెలల్లో బిల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన అంగీకారం తెలిపారు. ఈ విషయం పై డీఏఓ అంబికాసోని మాట్లాడుతూ తాను జిల్లాకు ఇటీవలే రావడంతో పెండింగ్ బిల్లుపై ఇప్పటివరకు సమాచారం లేదన్నారు. ఈ విషయం తన దృష్టిలో ఉంటుందని, మూడు నెలల్లో బిల్లులు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జనగామ వ్యవసాయశాఖ
అధికారులకు జిల్లా కోర్టు ఆదేశం
కాంట్రాక్టర్‌కు చెల్లింపులు
చేయకపోవడమే కారణం
మూడు నెలల్లో చెల్లిస్తామని చెప్పిన జిల్లా అధికారులు