
బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని పార్టీలు
హన్మకొండ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్ప నపై ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఈ నెల 18న నిర్వహించనున్న బీసీ బంద్ విజయవంతంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, కార్పొరేట్ రంగాలన్నీ అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్నాయని, ఈ బంద్‌ను విఫలం చేయాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, హోటళ్లు, బస్సులు, ఆటోలు, షాపింగ్ మాళ్లు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం.. దానిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అనంతరం బీసీ బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మరావు, ఆయా సంఘాల నాయకులు దొడ్డపల్లి రఘుపతి, దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, వైద్యం రాజగోపాల్, తమ్మేలా శోభారాణి, గడ్డం భాస్కర్, సంగాని మల్లేశ్వర్, ఆకారపు మోహన్, పల్లెపు సమ్మయ్య, బచ్చు ఆనందం, ఆడెపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి బీసీ బంద్‌ను
విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ
నాయకుల పిలుపు