
క్రీడాపండుగకు వేళాయె..
వరంగల్ స్పోర్ట్స్: క్రీడాపండుగకు వేళ అయ్యింది. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న 5వ ఓపెన్ నేషనల్ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు తెలిపారు. హనుమకొండ జేఎన్ స్టేడియంలోని డీఎస్‌ఏ ఆఫీస్‌లో బుధవారం చాంపియన్‌షిప్ వివరాలు విలేకరులకు వెల్లడించారు. నేటి నుంచి (16 నుంచి 18వ తేదీ వరకు) మూడు రోజుల పాటు జరుగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 937 మంది అథ్లెట్లు, 150 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటారని తెలిపారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 25 మంది, 70మంది రాష్ట్ర సాంకేతిక అధికారులు, 25 మంది స్థానిక అధికారులు, 50మంది వలంటీర్లు పాల్గొంటారని వెల్లడించారు. చాంపియన్‌షిప్‌లో ప్రతీ ఈవెంట్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని, వివిధ ప్రదేశాల నుంచి డ్రాఫ్ట్ చేసిన టెక్నికల్ అఫీషియల్స్, ఏఎఫ్‌ఐ, ఫొటో ఫినిష్ అధికారులు, లైవ్ స్ట్రీమింగ్ బృందానికి హోటల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య , హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్, అథ్లెటిక్స్ సంఘం జిలా కార్యదర్శి సారంగపాణి పాల్గొన్నారు.
నేటి నుంచి నేషనల్ అథ్లెటిక్స్ మీట్
హాజరుకానున్న 937 అథ్లెట్లు
ఏర్పాట్లు పూర్తి చేసిన అసోసియేషన్ బాధ్యులు