
మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
● జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు
మహబూబాబాద్ రూరల్ : ‘మక్కకు మద్దతేది’ శీర్షికన ఈ నెల 7వ తేదీన ప్రచురితమైన కథనానికి జిల్లా సహకార శాఖ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎనిమిది ప్రాంతాల్లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ధన్నసరి పీఏసీఎస్ పరిధికిలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్, కేసముద్రం పీఏసీఎస్ పరిధికి సంబంధించి విలేజి కేసముద్రంలో, గూడూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రంలో, మహబూబాబాద్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, బయ్యారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో బయ్యారం మండల కేంద్రంలో, గార్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలో, కొత్తగూడ పీఏసీఎస్ ఆధ్వర్యంలో పొగుళ్లపల్లి గ్రామంలో, తొర్రూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో తొర్రూరు మండల కేంద్రంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలురాగానే మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు.