సండ్ర కర్ర బంగారమే.. | - | Sakshi
Sakshi News home page

సండ్ర కర్ర బంగారమే..

Oct 16 2025 6:12 AM | Updated on Oct 16 2025 6:12 AM

సండ్ర

సండ్ర కర్ర బంగారమే..

జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా

సాక్షి, మహబూబాబాద్‌ : మానుకోటలో దొరికే సండ్ర కర్ర ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉండటం.. ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల కలప వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఇక్కడి కర్రకు ఖమ్మంలో ఎన్‌ఓసీ తీసుకొని సరఫరా చేస్తున్న విషయం బట్టబయలు కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే ఖమ్మంలో పలువురు అధికారులు కలప స్మగ్లర్లకు సహకరించడంతో వారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో ఆ వ్యవహారంలో సంబంధం ఉన్న జిల్లా అధికారుల్లో దడ పుడుతుంది.

కత్తా.. కాస్మొటిక్స్‌ తయారీ..!

జిల్లాలోని ఫారెస్టు ఏరియా 1,279.38 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో మహబూబాబాద్‌, గూడూరు ఫారెస్టు డివిజన్లల్లో గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం మండలాలతోపాటు, మహబూబాబాద్‌ డివిజన్‌లోని కేసముద్రం, జమాండ్లపల్లి మొదలైన ప్రాంతాలు అట వీ ప్రాంతంగా ఉన్నాయి. అయితే అటవీ ప్రాంతంతోపాటు, మైదాన ప్రాంతాల్లోని డోర్నకల్‌, కురవి, సీరోలు, నర్సింహులపేట, మరిపెడ మండలాల్లో సండ్ర కర్ర ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటి వరకు సండ్ర కర్ర అంటే రొకలి బండలు, రోకళ్ల కోసం వినియోగించడం, కర్ర ఇనుప కడ్డీని పోలిన గట్టితనం ఉండటంతో పలువురు ఇళ్లకు నిట్టాడుగా ఉపయోగించడమే తెలుసు. అయితే హర్యానా, మహా రాష్ట్ర మొదలైన రాష్ట్రాల్లో పాన్‌లో వినియోగించే కత్తా తయారీ, కాస్మోటిక్స్‌, ఇతర రసాయనాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఫారెస్టు అధి కారులు నిర్దారించిన ధర టన్నుకు రూ.11 వేల ఉండగా.. ఇతర రాష్ట్రాల్లో టన్ను సండ్ర కర్రకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతుంది.

ఎన్‌టీపీఎస్‌ యాప్‌తో..

ఏజెన్సీ ప్రాంతంలో చెట్లను నరకడం నేరం. అదే మైదాన ప్రాంతాల్లో రైతుల భూముల్లో ఉన్న చెట్లను నరికేందుకు పలు ఆంక్షలు ఉండేవి. అయితే రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం నేషనల్‌ ట్రాన్సిస్ట్‌ పర్మిట్‌ సిస్టమ్‌(ఎన్‌టీపీఎస్‌)యాప్‌ తీసుకొచ్చింది. రైతు భూమిని రెవెన్యూ అధికారులు నిర్దారించిన పత్రాలను యాప్‌లో నమోదు చేసి చెట్టుకు రూ.500 చెల్లించడం. ఎక్కడ చెట్లు కొడుతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలను పొందుపర్చాలి. అయితే ఆ వివరాలు సరి చూడకుండానే ఎన్‌ఓసీ వస్తుంది. దీనిని ఆసరాగా చేసుకొని సండ్ర కర్రకు బదులు నల్లతుమ్మ అని నమోదు చేసి అక్రమార్కులు రాజమార్గంలోనే కలపను జిల్లా దాటిస్తున్నారు. ఎవరైనా అడ్డు పడితే ఎన్‌ఓసీ చూపించడం, లేదా ఆమ్యామ్యాలు అప్పజెప్పి వెళ్తున్నట్లు సమాచారం.

ఎన్‌టీపీఎస్‌ యాప్‌తో అక్రమ తరలింపు

ఖమ్మంలో వెలుగు చూసిన జిల్లా కలప వ్యవహారం

జిల్లా అధికారులపై ఆరా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం

అక్రమార్కులకు అండగా..

జిల్లా నుంచి సండ్ర కర్రను రాజమార్గంగా ఇతర ప్రాంతాలకు తరలించడంలో అక్రమార్కులకు పలువురు ఫారెస్టు అధికారుల అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మైదాన ప్రాంతంలో ఉన్న టేకు, నవిలినార, సండ్ర చెట్లు ఏజెన్సీ వృక్షాలుగానే పరిగణిస్తారు. వీటిని నరికేందుకు ఫారెస్టు అధికారులు అనుమతి కావాలి. అయితే ఏజెన్సీ వృక్షాలను నరికి నల్లతుమ్మ, దుర్సెన మొదలైన పేర్లతో ఎన్‌టీపీసీలో అనుమతి తీసుకోవడం.. ఇది తెలిసినా పలువురు అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లాలోని కురవి, డోర్నకల్‌, సీరోలు, మరిపెడ ప్రాంతంలో కొట్టిన సండ్ర కర్రకు ఖమ్మం జిల్లా అదికారులు ఎన్‌ఓసీ ఇవ్వడం.. వారి బండారం బయటపడి సస్పెన్షన్‌కు గురికావడంతో జిల్లాలోని అక్రమార్కుల్లో భయం మొదలైంది. ఈ విషయం విచారణకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ జిల్లాలో తిరిగి సండ్ర కర్ర కోసిన ప్రాంతాల్లో పలువురిని ప్రశ్నించింది. దీంతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని ఫారెస్టు అధికారుల్లో వణుకుపుడుతుంది.

విచారణ చేపడుతున్నాం..

జిల్లా నుంచి సండ్ర కర్ర ఇతర ప్రాంతాలకు వెళ్లిన విషయంపై విచారణ జరుగుతుంది. డోర్నకల్‌, కురవి, సీరోలు, మరిపెడ మండలాల్లోని సండ్ర కర్ర కోసిన భూముల్లో పరిశీలన జరుగుతుంది. పలువురిని విచారణ చేసి.. జిల్లా అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నాం. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం.

– బత్తిని విశాల్‌, డీఎఫ్‌ఓ

సండ్ర కర్ర బంగారమే..1
1/1

సండ్ర కర్ర బంగారమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement