
బాలికలకు భరోసా..
విద్యారణ్యపురి : 2025–2026 విద్యాసంవత్సరంలో పీఎంశ్రీ పాఠశాలల్లో ఇక బాలికల సాధికారత, కౌమార దశ భద్రతాక్లబ్‌లు ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్‌నికోలస్ సంబంధిత జిల్లావిద్యాశాఖాఽధికారులను ఇటీవల ఆదేశించారు. దీంతో ఉమ్మడివరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో బాలికల సాధికారత, కౌమారదశ భద్రతాక్లబ్‌లు ఏర్పాటుచేయబోతున్నారు.
ఈ క్లబ్‌ల ముఖ్య ఉద్దేశం
● బాలికలకు కౌమారదశలో ఆరోగ్యం, హైజిన్, లైంగిక అంశాలపై అవగాహన కల్పించడం.
● ఆర్థిక, న్యాయ,సైబర్ భద్రత, డ్రగ్స్, మానసిక ఆరోగ్యం, కేరీర్‌పై విద్యార్థినులకు శిక్షణ
● పాఠశాలల్లో ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు, పోలీస్ లింకేజీతో బాల్యవివాహాలు, సైబర్ సమస్యలను గుర్తించి నివేదిక ఇవ్వడం లాంటి అంశాలు క్లబ్‌లు చేయాల్సి ఉంటుంది.
కౌమారదశ భద్రత క్లబ్ నిర్మాణం..
● జిల్లాల్లోని పీఎంశ్రీ పాఠశాలలో క్లబ్ నిర్మాణం ఇలా ఉంటుంది. ప్రతీతరగతి నుంచి ఇద్దరు విద్యార్థులు, (బాలుడు, బాలిక), ఒక మహిళా, ఒక పురుష ఉపాధ్యాయులు గైడ్‌గా ఉంటారు
● హెడ్మాస్టర్ క్లబ్‌చైర్మన్‌గా, స్థానిక పోలీస్‌కానిస్టే బుల్ బాహ్యసభ్యుడుగా ఉంటారు. ప్రతీపాఠశాలలో 14నుంచి 16 మంది సభ్యులు ఉండేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
పీఎంశ్రీపాఠశాలలో గ్రీవెన్స్‌బాక్స్‌లు
పీఎంశ్రీపాఠశాలల్లో గ్రీవెన్స్‌బాక్స్‌లు ఏర్పాటుచేయాల్సింటుంది. బాలికల కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులకు ఒకబాక్స్, సాధారణ ఫిర్యాదులకోసం మరొ బాక్స్‌ను ఏర్పాటు చే స్తారు. వేధింపులు, చైల్డ్ మ్యారేజ్, సైబర్‌మోసం వంటి సమస్యలను నివారించేందు కుగాను చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
క్లబ్‌ల ఏర్పాటు నేటినుంచి అమలులోకి..
పీఎంశ్రీస్కూళ్లలో ఈ క్లబ్‌ల ఏర్పాటు ఈనెల 15నుంచి అమలులోకి తీసుకురానున్నారు. నెలవారీగా ఏయే కార్యక్రమాలు చేపట్టాలనేది పలు అంశాలు ఉన్నాయి. అక్టోబర్‌లో బాలల లైంగిక దుర్వినియోగం, ఆరోగ్యం, ఆర్థిక సాక్షరతపై అవగాహన కల్పిస్తారు. నవంబర్‌లో న్యాయసాక్షరత, సైబర్ భద్రత, స్వీయరక్షణ, డిసెంబర్‌లో మానసిక ఆరోగ్యం, 2026 జనవరిలో జీవన నైపుణ్యాలు, బాల్యవివాహాలు, నేషనల్ గర్ల్స్ చైల్డ్‌డే పై అవగాహన కల్పిస్తారు. ఫిబ్రవరిలో కేరీర్ మార్గనిర్దేశంపై అవగాహన కల్పిస్తారు. పలు అంశాలు ఆన్‌లైన్‌లోకూడా సెషన్లు టీసాట్ ద్వారా నిర్వహిస్తారు. ఇందుకు కూడా షెడ్యూల్ ప్రకారం కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో 658 పీఎంశ్రీ స్కూళ్లలో బాలికల భద్రత సురక్షిత వాతావరణం, సఫలీకరణకు దోహదపడే గర్ల్స్ చైల్డ్ ఎంపవర్‌మెంట్, అడోలోసెంట్ సేఫ్ట్‌టీ క్లబ్స్ (సీజీఈఏఎస్‌సీఎస్ ) ఏర్పాటుచేస్తారు.
ప్రతీ పీఎంశ్రీ పాఠశాలకు రూ.15వేలు
బాలకలసాధికారత, బాలికల కౌమారదశభద్రతాక్లబ్‌లను ఏర్పాటుచేస్తున్న ఆయాపీఎంశ్రీ పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ. 15వేల చొప్పున మంజూరు చేశారు.ఆయానిధులు ఎలా వినియోగించుకోవాలో కూడా ఆయాపాఠశాలల హెచ్‌ఎంలకు సమాచారం అందించారు. ఈనెల 15వరకు క్లబ్ ఏర్పాటు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. పీటీఎం సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించాల్సింటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్టుమెంట్లతో సమన్వయం జరగాల్సి ఉంటుంది. జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్, లింగసమానత్వం కోఆర్డినేటర్ పర్యవేక్షిస్తారు.
ఈ క్లబ్‌ల నిర్మాణం జరిగే పీఎం శ్రీ స్కూళ్ల సంఖ్య జిల్లాల వారీగా ఇలా
జిల్లా పాఠశాలల సంఖ్య
హనుమకొండ 13
వరంగల్ 14
జనగామ 15
మహబూబాబాద్ 21
ములుగు 08
జయశంకర్ భూపాలపల్లి 07
పీఎంశ్రీ స్కూళ్లలో విద్యార్థినుల సాధికారత, కౌమారదశ భద్రతాక్లబ్‌లు ఏర్పాటు
ఒక్కో పాఠశాలకు రూ. 15 వేల చొప్పున మంజూరు
నేటి నుంచి అమలుకు ఉపక్రమణ