
మల్లేశ్ అంత్యక్రియలు పూర్తి
దేవరుప్పుల : రిమాండ్ ఖైదీ వారాల మల్లేశ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జైళ్ల శాఖ నిబంధనల మేరకు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని పోలీసుల నిఘాలో స్వగ్రామం సింగరాజుపల్లికి తరలించి అదేరోజు సాయంత్రం అంత్యక్రియలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వారాల మల్లేశ్‌కు ఇదే గ్రామానికి చెందిన మిత్రుడు పడకంటి బ్రహ్మచారితో సరదాగా గొడవ జరిగింది. ఇందులో కర్ర తగిలి బ్రహ్మచారి చేయి విరిగింది. ఈ విషయమై పీఎస్‌లో కేసు నమోదు కాగా హాస్పిటల్ నివేదిక ఆధారంగా మల్లేశ్‌ను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్ జనగామ సబ్ జైలులో బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసుల వ్యూహాత్మకంతో ప్రశాంతంగా అంత్యక్రియలు..
రిమాండ్ ఖైదీ మల్లేశ్ ఆత్మహత్య తీరుపై గ్రామస్తులు కోపోద్రిక్తులై ఇప్పటికే జనగామ జైలు ఎదుట ఆందోళన చేపట్టిన విషయం విధితమే. ఈ తరుణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో మల్లేశ్‌అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ ఎంజీఎంలో ఉస్మానియా, గాంధీ, వరంగల్ కేఎంసీ వైద్య బృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో మల్లేశ్ మృతదేహాన్ని జనగామ మీదుగా కాకుండా ఇతర మార్గాల ద్వారా సింగరాజుపల్లికి తరలించగా కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తి చేశారు. పాలకుర్తి సీఐ జానకీరామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
హైమా కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు?
మల్లేశ్ ఆత్మహత్యతో హైమ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న మల్లేశ్, హైమా దంపతులకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు కాగా ప్రస్తుతం హైమా మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో మల్లేశ్ ఆత్మహత్యతో ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరని బంధువులు, గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పందించి హైమా కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ఇప్ప వీరారెడ్డి, సింగారపు రమేశ్, తదితరులు డిమాండ్ చేశారు.
పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహం తరలింపు
పోలీసుల నిఘాలో ముగిసిన
దహన సంస్కారాలు

మల్లేశ్ అంత్యక్రియలు పూర్తి