
ముగిసిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హనుమకొండలోని డీఎస్‌ఏ బాక్సింగ్ హాల్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన అండర్–19 బాలబాలికల రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేసి మాట్లాడారు. జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలన్నారు. ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి వెలిశెట్టి ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 500 మంది మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన 15మంది బాలికలు, 13 మంది బాలురు ఈ నెల 28 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు అరుణాచల్ ప్రదేశ్‌లో జరుగనున్న ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ, మాజీ కార్పొరేటర్ మంచాల స్వామిచరణ్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారథి, అండర్–19 జిల్లా కార్యదర్శి ఎన్. శ్రీధర్, భూపాలపల్లి డీవైఎస్‌ఓ సి.హెచ్. రఘు, పీఈటీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.