కారాఘోరం! | - | Sakshi
Sakshi News home page

కారాఘోరం!

Oct 13 2025 8:20 AM | Updated on Oct 13 2025 10:03 AM

కారాఘోరం!

కారాఘోరం!

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

● వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్‌ జైలుకు తరలించారు. సబ్‌జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది.

● జనగామ సబ్‌జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్‌ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్‌ నీటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన అధికారులు సబ్‌జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్‌జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్‌, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్‌ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్‌జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది.

ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు

ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్‌ స్టాటిస్టిక్స్‌ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌లో వరంగల్‌ సెంట్రల్‌ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్‌, నర్సంపేట సబ్‌జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్‌ సెంట్రల్‌ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్‌ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్‌జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్‌ ఎయిర్‌ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్‌జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్‌, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్‌ ఎయిర్‌ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్‌లోని పోలీస్‌స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి.

సహజ మరణాలకు అనేక కారణాలు..

సబ్‌జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం.

జైళ్లలో ఖైదీల సహజ మరణాలు,

ఆందోళనకరంగా ఆత్మహత్యలు

జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు

కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

సంచలనంగా జనగామ సబ్‌జైలు ఖైదీ ఆత్మహత్య..

చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ప్రాణాంతకమే..

వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి.

– డాక్టర్‌ కేశవులు,

మానసిక వైద్య నిపుణుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement