
బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
కొత్తగూడ: పిల్లలిద్దరు అన్నాచెల్లెలి కుమారులు. దసరా పండుగకు తాతమ్మ ఇంటికి వచ్చారు. ఇంట్లో వాళ్లు ఓ చావు కార్యక్రమానికి వేరే ఊరికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో చిన్నారులిద్దరు బహిర్భూమి కోసం సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. అందులో దిగిన చిన్నారులకు లోతు తెలియక ప్రమాదవశాత్తు ఒకరితర్వాత మరొకరు మునిగి చనిపోయారు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నివాసం ఉంటున్న ఇటుకాల నర్సయ్య–స్వాతి దంపతుల కుమారుడు రితిక్(10), ములుగు జిల్లా పులిమడుగు గ్రామానికి చెందిన అనిత– శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్(09)లు దసరా సెలవులకు ఎంచగూడెంలోని తాతఅమ్మ ఇటుకాల సారయ్య–నర్సమ్మ వాళ్ల ఇంటికి వచ్చారు. వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లో బంధువు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు ఆ బాలురిద్దరిని ఇంటి వద్ద వదిలివెళ్లారు. మధ్యాహ్నం సమయంలో రితిక్, జతిన్‌లు కలిసి బహిర్భూమికి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు. చావుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి వద్ద చిన్నారులు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించగా బావిగడ్డపై సమీపంలో పిల్లల చెప్పులు కనిపించాయి. అనుమానంతో వెతకడంతో ముందుగా రితిక్ మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న కొత్తగూడ ఎస్సై రాజ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని జతిన్ మృతదేహన్ని బయటకు తీయించారు.
అన్నా చెల్లెలి కుమారులు...
అనిత, నర్సయ్యలు అన్నాచెల్లెళ్లు. అనిత కుమారుడు జతిన్, నర్సయ్య కుమారుడు రితిక్‌లు వరుసకు బావాబామ్మర్దులు. ఇటీవల కురిసిన వర్షాలకు బావిగడ్డ నానడం.. అందులోకి దిగిన జతిన్, రితిక్‌లు బావిగడ్డ జారడంతో ఈత రాకపోవడంతో మునిగి చనిపోయినట్లు భావిస్తున్నారు. పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పండుగ కోసం వచ్చి పరలోకాలకు వెళ్లారని, బావాబామ్మర్దులు ఒకరిని కాపాడేందుకు మరొకరు చనిపోయారంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు పిల్లల మృతితో ములుగు జిల్లా పులిమడుగు, వరంగల్ జిల్లా నర్సంపేట, మహబూబాబాద్ జిల్లా ఎంచగూడెం గ్రామాల్లో విషాదం నెలకొంది.
బహిర్భూమికి వెళ్లగా ప్రమాదం
మృతులు అన్నాచెల్లెలి కుమారులు
దసరా పండుగకు తాతమ్మ ఇంటికి..
మూడు గ్రామాల్లో విషాదం

బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి