
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు షురూ
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ బాక్సింగ్ హాల్‌లో శనివారం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–17 రాష్ట్ర స్థాయి బాలబాలికల బాక్సింగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో పతకం సాధించిన క్రీడాకారులకు తన వంతుగా రూ.50వేలు న గదు పురస్కారం అందజేస్తానన్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 130 మంది బాలురు, 150 మంది బాలికలు హాజరైనట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెలిశెట్టి ప్రశాంత్‌కుమార్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు అరుణాచల్‌ప్రదేశ్‌లో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలి పారు. అనంతరం బాక్సింగ్‌లో ఎన్‌ఐఎస్ పూర్తి చేసిన ఖమ్మంకు చెందిన క్రీడాకారిణి మానసను సన్మానించారు. కార్యక్రమంలో మామునూరు పీటీసీ సీఐ కాశీరాం, ఒ లింపిక్స్ సంఘం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మంచాల స్వామిచరణ్, తెలంగాణ పీఈటీల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శీలం పార్ధసారథి, కె. మల్లారెడ్డి, ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్, భూపాలపల్లి డీవైఎస్‌ఓ రఘు, ఇండియా బాక్సింగ్ కోచ్ ఆనంద్‌భాస్కర్ పాల్గొన్నారు.
భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
● కుటుంబ కలహాలే కారణం?
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే కారణమని సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ములకల రాజేశ్వరి, కిరణ్‌లకు నాలుగు నెలల కిందట ప్రేమవివాహం జరిగింది. కాగా, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం భార్యాభర్తలిద్దరూ పురుగులమందు తాగగా స్థానికులు గమనించి మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజేశ్వరిని భూపాలపల్లికి , కిరణ్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. ఈ విషయమై ఎస్సై పవన్‌కుమార్‌ను సంప్రదించగా భార్యాభర్తలు పురుగుల మందు తాగిన విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ, ఎలాంటి ఫిర్యాదూ రాలేదని తెలిపారు.