
రైతుల ఆర్థిక ప్రగతికి మరింత కృషి
జనగామ రూరల్: వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ పథకం జిల్లా రైతుల్లో ఆశలు నింపుతోంది. దేశ వ్యాప్తంగా వంద జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి నాలుగు జిల్లాలు జనగామ, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలను గుర్తించారు. ఈ మేరకు శనివారం ప్రధాన మంత్రి మోదీ ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించగా, జనగామ కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఉత్పాదకతలో మార్పులు తీసుకొచ్చేలా కేంద్రం నూతన పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు కానుందన్నారు.
జనగామకు ప్రత్యేక ప్రాధాన్యం
వర్ష ఆధారిత పంటల ఉత్పత్తి ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన జనగామ జిల్లాలో ఈ పథకం మొక్కజొన్న, పత్తి, ధాన్యం, మిర్చి వంటి పంటలకు కొత్త దారులు తెరుస్తుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా పంటల ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, మార్కెట్ లింకులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో రైతులకు మధ్యవర్తుల అవసరం తగ్గి ఉత్పత్తికి తగిన ధర లభించే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
పీఎం ధన్ ధాన్య కృషి యోజన
పథకం ప్రారంభం
తెలంగాణలో జనగామతోపాటు
మరో మూడు జిల్లాలకు అవకాశం
వర్చువల్‌గా పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పాల్గొన్న కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు