
వైద్యవిద్యకు ఆర్థికసాయం అభినందనీయం
● కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
వీసీ నందకుమార్ రెడ్డి
హన్మకొండ: వైద్య విద్యలో ప్రవేశం సాధించి ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అండగా నిలిచి చేయూతనందించడం అభినందనీయమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.వి.నందకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో వైద్యవిద్యలో ప్రవేశం పొందిన 10 మంది విద్యార్థులకు మొత్తం రూ.2.70 లక్షలు వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.వి.నందకుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జునరెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించారు. వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ.. ఫీజు చెల్లించే స్థోమత లేని 30 మంది విద్యార్థులకు నెలకు రూ.3,500 వచ్చే ఏర్పాట్లు చేస్తానన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో బుక్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి, సభ్యులు రావుల మధు, ఆకుల భాస్కర్, నరేందర్, యాదగిరి, కందిమల్ల జితేందర్, ఇందిర, రోజా, బాబు రావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.