
మంత్రాల నెపంతోనే వృద్ధురాలి హత్య
నెల్లికుదురు : ఓ వృద్ధురాలిని హత్య చేసి బావిలో పడేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన వీరగాని రాధమ్మ (80) ఒంటరిగా నివసిస్తోంది. కాగా, మండల కేంద్రానికి చెందిన నిందితులు వీరగాని ఉప్పలయ్య, అతడి తమ్ముడు మహేశ్‌కు రాధమ్మ వరుసకు పెద్దమ్మ అవుతుంది. ఈ క్రమంలో ఉప్పలయ్య తన ఆరోగ్యం బాగలేకపోవడానికి కారణం రాధమ్మ మంత్రాలు చేయడమేనని ఆమైపె కక్ష పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తన తమ్ముడు మహేశ్‌కు చెప్పగా అతడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన రాత్రి 11గంటల సమయంలో ఇద్దరు కలిసి రాధమ్మ ఇంటికెళ్లారు. ఆమెను బయటకు పిలిచి తమ వెంట తెచ్చుకుని ఇనుపరాడ్‌తో తలపై బలంగా కొట్టారు. దీంతో రాధమ్మ కిందపడగా పక్కనే ఉన్న చేదబావిలో పడేశారు. మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం మహేశ్ ఈ విషయం తన స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన దువ్వాడ రాజుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో రాజు బైక్ తీసుకుని రాగా ముగ్గురు కలిసి మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి బ్రిడ్జివద్దకు వెళ్లి రాధమ్మ హత్యకు ఉపయోగించిన రాడ్‌ను వాగులో పడేశారు. వాగులోనే రక్తపు మరకలు అంటుకున్న తమ దుస్తులను శుభ్రం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు కలిసి రంగనాయకమ్మ గుడి దగ్గర ఉన్న బెల్టుషాపులో మద్యం తాగారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐదు రోజుల్లోనే నిందితులు ఉప్పలయ్య, మహేశ్, రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
నిందితులు మృతురాలి బంధువులే..
రాధమ్మ హత్య ఘటనలో ముగ్గురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన డీఎస్పీ కృష్ణకిశోర్