
వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తాం
ఖిలా వరంగల్: సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సావాలను వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కరీమాబాద్‌లోని ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై నగర మేయర్ గుండు సుధారాణి, నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి మంత్రి సురేఖ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ ఆట స్థలాలను శుభ్రం చేయాలని బల్దియా అధికారులను ఆదేశించారు. దసరా కమిటీ విజ్ఞప్తి మేరకు రంగలీల మైదానంలో మైసూరును తలపించేలా దసరాకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాన రహదారుల్లోని గుంతలను పూడ్చివేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉర్సుతోపాటు కాశిబుగ్గ, రంగశాయిపేట, శివనగర్‌లో మహిళా సంఘాలతో ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు, ఈనెల 21న వేయి స్తంభాల దేవాలయంలో నిర్వహించనున్న వేడుకలు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడారు. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీసీపీ సలీమా, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ శుభం ప్రకాశ్, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్లార్లు ఇక్బాల్, శ్రీకాంత్, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, సత్యనారాయణ, దసరా ఉత్సవ కమిటీ బాధ్యులు నాగపూరి సంజయ్‌బాబు గౌడ్, మేడిది మధుసూదన్, మండ వెంకటన్న, గోనె రాంప్రసాద్, గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు.
బతుకమ్మ, విజయదశమికి ఏర్పాట్లు చేయండి
రంగలీల మైదానం అభివృద్ధికి చర్యలు
అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ