
ఆటలు ఆడేదెలా?
క్రీడా మైదానాల్లో అసౌకర్యాలు.. పట్టించుకోని అధికారులు
కురవి: జిల్లాలోని సీరోలు, కురవి మండలాల్లోని పలు గ్రామాల్లో క్రీడా మైదానాలు అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. క్రీడా మైదానాలకు సరైన స్థలాలు కరువయ్యాయి. నీళ్ల ట్యాంకులు, నర్సరీలు, గుట్టలు, పాఠశాలల్లో క్రీడామైదానాలను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, క్రీడాకారులు ఆటలు ఎలా ఆడాలని ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో క్రీడా మైదానాలను చాలా గ్రామాల్లో ఏర్పాటు చేశారు. అయితే కొన్ని గ్రామాల్లో స్థలాల కొరత ఉండడం వల్ల ఇలా ఏర్పాటు చేయడంతో ఆటలకు ఉపయోగ పడడంలేదు. దీంతో విద్యార్థులు, క్రీడాకారులు ఆటలు ఆడే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. కాగా, ప్రభుత్వం పలు రకాల అసోసియేషన్‌ల పేరిట ఆటలను ఆడిస్తోంది. అయితే తూతూ మంత్రంగా ఆటలు ఆడిపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం క్రీడామైదానాలకు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసి క్రీడలను అభివృద్ధి చేయాల్సి ఉంది.