
సాయుధ పోరాటం@ జనగామ
జనగామ: తెలంగాణ సాయుధ పోరాటం జనగామలోనే పురుడు పోసుకుంది. విస్నూరు రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో నల్లా నర్సింహులు, చకిలం ధర్మారెడ్డి, యాదగిరిరావు నేతృత్వంలో 1946 జూలై 14న కడవెండి పోరుకు అంకురార్పణ చేశారు. గబ్బెట తిరుమల్‌రెడ్డి, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, చాకలి అయిలమ్మ, ఏసిరెడ్డి నర్సింహారెడ్డి, గానుగుపహాడ్ నారాయణరెడ్డి, దండబోయిన నర్సింహులు, బిట్ల ముత్తయ్య ప్రాణత్యాగం చేశారు. జనగామ మొట్టమొదటి ఎమ్మెల్యే గంసాని గోపాల్‌రెడ్డి రాజకీయ నాయకుడిగా సాయుధ పోరాటానికి తన సేవలందించారు. నిజాం నవాబ్ 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఎదుట లొంగిపోయారు. సైనిక ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్‌కౌంటర్ రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట దళం సెంట్రల్ కమాండ్‌గా పనిచేసిన గంగసాని తిరుమల్‌రెడ్డిని సైనిక బలగాలు పట్టుకుని చెట్టుకు కట్టేసి కంచనపల్లిలో మొదటి ఎన్‌కౌంటర్ చేశాయి. దొరల స్వాధీనంలో ఉన్న 1.40 కోట్ల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసేందుకు సాయుధ పోరాటం దోహదపడింది.