
పోరాటాల కేంద్రం.. బయ్యారం
బయ్యారం: నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటాలకు బయ్యారం కేంద్రంగా బిందువుగా చెప్పవచ్చు. నిజాం పాలనను వ్యతిరేకించిన దామినేని వెంకటేశ్వరరావు, కంచర బుచ్చిమల్లుతోపాటు 30 మందిని మండలంలోని బండ్లకుంట సమీపంలో నిజాం పోలీసులు కాల్చి చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఎడ్లబండ్లపై గ్రామాల్లో ఊరేగించి అందరినీ ఒకే చితిపై పెట్టి కుటుంబ సభ్యులు సైతం కడసారి చూపునకు నోచుకోకుండా దహనం చేశారు. పోరాటాల పురిటిగడ్డగా పేరు తెచ్చుకున్న బయ్యారంలో 1969లో మొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక స్తూపం నిర్మించారు. బయ్యారం గాంధీసెంటర్‌లో ఉన్న అమరవీరుల స్మారక స్తూపం నాటి పోరాట పటిమ, త్యాగాలకు సాక్షిగా నిలుస్తోంది.
ఊరూరా ఉద్యమకారులు
జనగామ: జనగామ మండలంలోని వడ్లకొండ, గానుగుపహా డ్, మరిగడి, ఎర్రగొల్లపహాడ్, సిద్ధెకి ఇలా అనేక గ్రామాలు రజాకార్ల అరాచకాలను ఎదురించాయి. వడ్లకొండకు చెందిన దండెబోయిన నరహరి, మేదరి గాల్‌రెడ్డి, దేవుసాని వెంకటయ్య, సిద్ధిరాల యాదగిరి, గజ్జెల సాయిలు, కొత్త పాపిరెడ్డి రజాకార్లతో పోరాడారు. గానుగుపహాడ్‌లో నారాయణరెడ్డి, పులిగిళ్ల కొమురయ్య, కారింగుల నారాయణరెడ్డి, వనమాల నాగమల్లయ్య.. ఇలా ఎందరో వీరులు ఉద్యమంలో నేలకొరిగారు. దండెబోయిన నరహరిపై నిజాం నవాబు 18 మర్డర్ కేసులను నమోదు చేసి రెండు ఉరిశిక్షలు విధించారు. ఓ సమయంలో రజాకార్లకు పట్టుబడిన నరహరిని సజీవంగా చితిపై పడుకోబెట్టి కాల్చేందుకు ప్రయత్నిస్తుండగా చాకచక్యంగా తప్పించుకున్నాడు. నరహరిని ప్రాణాలతో పట్టుకోవాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశాడు. 12 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆయన 20 ఏళ్ల క్రితం మృతి చెందారు. గానుగుపహాడ్‌కు చెందిన నారాయణరెడ్డి ఉపాధ్యాయ వృత్తి వీడి రజాకార్లను తుదముట్టించేందుకు దళంలో చేరాడు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా కూటిగల్ గ్రామంలో రజాకార్లు నారాయణ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు.
జనగామ: నిజాం పాలనలోనే జనగామలో తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు. 1943లో పాఠశాలకు అంకుర్పారణ చేసి.. 1945లో విద్యాబోధన ప్రారంభించారు. ప్రెస్టన్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఉపద్రష్ట వెంకటరామశాస్త్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనగామ తాలూకాలో మొదటి తెలుగు పాఠశాలకు శ్రీకారం చుట్టారు. తెలుగుకు ఓ గుర్తింపు తీసుకొచ్చేందుకు తాపత్రయపడ్డారు. ఆంధ్ర భాషాభివర్ధిని ఉన్నత పాఠశాల(ఏబీవీ)గా నామకరణం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1949లో నాటి ప్రభుత్వం ఏబీవీ స్కూల్‌ను ఎయిడెడ్‌గా మార్చింది.

పోరాటాల కేంద్రం.. బయ్యారం

పోరాటాల కేంద్రం.. బయ్యారం

పోరాటాల కేంద్రం.. బయ్యారం