
ప్రయాణికుల భద్రతే ముఖ్యం
మహబూబాబాద్ రూరల్: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని సికింద్రాబాద్ డివిజన్ సేఫ్టీ కమిషనర్ మాధవి అన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో నూతనంగా నిర్మించిన మూడో లైన్ సేఫ్టీ అంశాలపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్) బృందం ఉన్నత అధికారులు మంగళవారం సందర్శించింది. ప్రత్యేక రైలులో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న సీఆర్‌ఎస్ బృందం మొదటగా సిగ్నల్ ఆపరేటింగ్, స్టేషన్ మాస్టర్ గది, సేఫ్టీ గదిలో సాంకేతిక అంశాలను పరిశీలించింది. అనంతరం నూతనంగా నిర్మించిన రైల్వే లైన్ పనివిధానం, నిర్మాణశైలిని సందర్శించిన అధికారులు దక్షిణ మధ్య రైల్వే శాఖ సేఫ్టీ కమిషన్ నిబంధనల మేరకు పనులు జరిగాయా.. లేదా.. అని పరిశీలించారు. మూడో రైల్వే ట్రాక్ వద్ద పాయింట్ తిక్ వెబ్ స్విచ్ పనివిధానాన్ని పరిశీలించి, అక్కడి నుంచి నూతనంగా నిర్మించిన ఎల్.సీ 80 రైల్వే గేట్ క్యాబిన్ వద్ద శాఖాపరమైన అంశాలను తనిఖీ చేసి, అక్కడి ఆవరణలో మొక్కలు నాటారు. డీఆర్‌ఎం రాజగోపాలకృష్ణన్, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ విభాగాల ఉన్నత అధికారులు గుడేషార్, సృజన్ రెడ్డి, రణధీర్ రెడ్డి, సునీల్ కుమార్ వర్మ, శ్రీనివాసరావు, స్థానిక రైల్వే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మోహన్ కుమార్, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కనకరాజు, స్టేషన్ మాస్టర్ రమేష్ పాల్గొన్నారు.
రైల్వే థర్డ్‌లైన్ పరిశీలన
కేసముద్రం: కేసముద్రం రైల్వేస్టేషన్ మీదుగా కొత్తగా ఏర్పాటుచేసిన రైల్వే థర్డ్‌లైన్‌ను కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్‌ఎస్) మాధవి, డీఆర్‌ఎం రాజగోపాలకృష్ణన్‌తో కలిసి మంగళవారం పరీశీలించారు. మండలంలోని తాళ్లపూసపల్లి, కేసముద్రం, ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మీదుగా అప్‌లైన్‌లో థర్డ్‌లైన్‌పై ప్రత్యేకంగా మోటార్ ట్రాలీపై ప్రయాణిస్తూ, అడుగడుగునా పనితీరును పరిశీలించారు. రైల్వేస్టేషన్‌ను సందర్శించారు.
దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి