
మంత్రుల కాన్వాయ్ అడ్డగింత
కురవి: రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత ఆధ్వర్యంలో మంగళవారం మహబూబాబాద్ జిల్లా కురవిలోని 365 జాతీయ రహదారిపై మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. మంత్రులు దామోదరరాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మానుకోటలో మెడికల్ కాలేజీ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు మరిపెడ నుంచి కురవి మీదుగా జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ.. పార్టీ శ్రేణులతో కలిసి కురవిలోని 365 జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. దీంతో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య గమనించి మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌తో పలుమార్లు మాట్లాడి ధర్నా విరమించుకుని సహకరించాలని సూచించగా ససేమిరా అన్నారు. ఈ క్రమంలో మంత్రుల కాన్వాయ్ కురవికి చేరుకున్న సమయంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో మాజీ మంత్రి, సత్యవతి, మాజీ ఎంపీ కవిత రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో మంత్రుల కాన్వాయ్ ధర్నా ప్రదేశానికి చేరుకుంది. దీంతో స్పెషల్ పార్టీ పోలీసులు రోప్ సాయంతో కాన్వాయ్‌ను మానుకోట వైపునకు పంపించారు.
చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూసేందుకు..
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత మాట్లాడుతూ.. కాళేశ్వరం నీరును ఆంధ్రాకు పంపించి ఏపీ సీఎం చంద్రబాబు మెప్పుపొందేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూసేందుకు కాళేశ్వరంపై విషం కక్కు తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని ఎండబెడితే బనకచర్లకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ సైకోలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పిచ్చిరెడ్డి, లాలయ్య, రవినాయక్, భరత్, రాంచంద్రయ్య, మల్లికార్జున్, రమేశ్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి, మాజీ ఎంపీ రోడ్డుపై బైఠాయింపు
కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఉపసంహరించుకోవాలి

మంత్రుల కాన్వాయ్ అడ్డగింత