
గుత్త మేసీ్త్ర దారుణ హత్య..
● బ్యాంకుకు వెళ్లొస్తానని హత్యకు గురైన మహిళ
● రోడ్డు పక్క నీటి గుంతలో తేలిన మృతదేహం
● పురుషోత్తమాయగూడెం శివారులో ఘటన..
● ఉల్లెపల్లికి చెందిన మహిళగా గుర్తింపు
మరిపెడ రూరల్: మహిళా వ్యవసాయ కూలీల గుత్త మేసీ్త్ర దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, మరిపెడ సీఐ రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని ఉల్లెపల్లికి చెందిన మహిళా వ్యవసాయ కూలీల మేసీ్త్ర బంటు వెంకటమ్మ (55) సోమవారం మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో పని చూసుకుని, ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో డబ్బులు తీసుకురావడానికి వెళ్లింది. అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన కూతురు ఉపేంద్రకు ఫోన్ చేసి తాను ఇంటికి వస్తున్నానని, తమ్ముడు నరేశ్‌ను బైక్ తీసుకుని పురుషోత్తమాయగూడెం స్టేజీ వద్దకు రమ్మని చెప్పింది. కుమారుడు స్టేజీ వద్దకు వచ్చి తల్లి వెంకటమ్మకు ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. కొంత సమయం వేచి చూసి కుమారుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు పొలం వద్దకు వెళ్తున్న క్రమంలో జోగులపాడు రహదారిలో నీటి గుంతలో సదరు మహిళ మృతదేహం తేలి ఉంది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుమార్తె ఉపేంద్ర ఘటనాస్థలికి చేరుకుని తల్లిగా గుర్తించింది. మృతదేహం సమీపంలోని రహదారిలో రక్తపు మరకలు, పగిలిన గాజులు, మద్యం బాటిళ్ల లేబుల్స్ ఉన్నాయి. సదరు మహిళను దుండగులు చున్నీతో ఉరేసి గొంతులో పొడిచి హత్యచేశారు. అనంతరం ఈడ్చుకెళ్లి నీటి గుంతలో పడేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనాస్థలికి మరిపెడ సీఐ రాజ్‌కుమార్ చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతురాలు కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి భర్త లింగయ్య, కుమారుడు, కూతురు ఉంది.
గుంతలోపడి రైతు మృతి
మహబూబాబాద్ రూరల్: గుంతలోపడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మహబూబాబాద్ మండలం కేవులతండా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అజ్మీరా శంకర్(45) రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న గుంతను గమనించక ప్రమాదవశాత్తు అందులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య బుల్లి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

గుత్త మేసీ్త్ర దారుణ హత్య..