ఆర్థిక ఇబ్బంది ఉన్నా.. అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బంది ఉన్నా.. అభివృద్ధే లక్ష్యం

Jul 22 2025 8:33 AM | Updated on Jul 22 2025 8:33 AM

ఆర్థిక ఇబ్బంది ఉన్నా.. అభివృద్ధే లక్ష్యం

ఆర్థిక ఇబ్బంది ఉన్నా.. అభివృద్ధే లక్ష్యం

గణపురం : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే మరో వైపు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సోమవారం గణపురం మండలం చెల్పూరు గ్రామంలో కేటీపీపీ సీఎస్‌ఆర్‌ రూ.5.50 కోట్ల నిధులతో బస్టాండ్‌ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రజా ప్రభుత్వం కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే పని చేస్తోందన్నారు. భూపాలపల్లి నియోజక వర్గంలో మెదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. మరో 1,500 ఇళ్లు ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో వరదలు సంభవించి భారీ నష్టం జరిగితే అది పూడ్చడానికి ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్ని శాఖల మంత్రుల వద్దకు తిరిగి నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాడన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి నడిపిస్తున్నామని వివరించారు. గణపురంలోని గాంధీనగర్‌ వద్ద 60 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తున్నామని, అందులో మహిళలకు మిని ఇండస్ట్రీస్‌ ఏర్పాటుకు 20 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరి గారని, అన్ని అర్హతలు ఉన్న నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నియోజకవర్గంలో 15 వేల రేషన్‌ కార్డుల్లో మార్పులు చేశామని నూతనంగా 5 వేల రేషన్‌ కార్డులు అందించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. కొత్తపల్లిగోరి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని అన్నారు. జిల్లాకు మైనింగ్‌ కళాశాలతో పాటు పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేయాలని, అలాగే డీబీఎం 38 కాల్వకు రూ.320 కోట్లు మంజూరు చేయాలని మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐత ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ కిరణ్‌ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్‌ కుమార్‌, విజయలక్ష్మితో పాటు అధికారులు పాల్గొన్నారు.

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

చెల్పూరులో బస్టాండ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement