
ప్రభుత్వం పింఛన్ పెంపును ప్రకటించాలి
నెహ్రూసెంటర్: ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పెంపును వెంటనే ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ డి మాండ్ చేశారు. ఆగస్టు 13న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాగర్జన సన్నాహాక సమావేశాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు దివ్యాంగులు, వృద్ధులకు ప్రస్తుతం అందజేస్తున్న పింఛన్లు పెంచి ఇవ్వాలన్నారు. పింఛన్‌దారులకు చెల్లింపుల్లో జ్యాపం చేస్తున్న ప్రభుత్వం.. సీఎం, ఎమ్మెల్యే లు మాత్రం సమయానికి జీతాలు తీసుకుంటున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచి ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో పింఛన్ పెంపుపై ప్రతిపక్షాలు కూడా మాట్లాడడం లేదన్నారు. 17 ఏళ్లుగా దివ్యాంగుల పక్షాన పోరాటం చేస్తున్నానని, కేసీఆర్, సీఎం రేవంత్‌రెడ్డి మాదిరి బంగ్లాలో, గడీల్లో ఉన్నోళ్లకు పేదల కష్టాలు తెలియవన్నారు. తాను పేదరికం నుంచి వచ్చానని, అందుకే పేదల కోసం కొట్లాడుతున్నానని తెలిపారు. సభలో వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.పాషా, పోలెపాక శంకర్, పోలెపాక ఎల్లయ్య, ప్రవీణ్, ఇరుగు రవీందర్, శేషం కిరణ్, కత్తుల రేణుక, ఎండీ.రజియా, మణెమ్మ, తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ కథనం చూసి చలించా..
‘సాక్షి’ దినపత్రిలో 2012లో ప్రచురితమైన ‘కన్న తల్లిని బస్టాండ్‌లో వదిలేసిన బిడ్డ’ కథనాన్ని చదివి చలించానని మంద కృష్ణమాదిగ సభలో గుర్తు చేసుకున్నారు. ‘సాక్షి’ కథనాన్ని చూపుతూ దివ్యాంగులకు సమాజంలో, ఇంట్లో గుర్తింపు ఇచ్చేలా, పింఛన్ పెంచేలా ప్రభుత్వాలపై పోరాటాలకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చామన్నారు. పోరాటాల ఫలితంగానే నాడు రూ. వెయ్యి పింఛన్ రావడంలో విజయం సాధించానని చెప్పారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ