
ప్రభుత్వ పథకాల్లో మహిళలకు పెద్దపీట
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
నెహ్రూసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. ఆర్టీసీ నూతన బస్సు సర్వీసులను డిపో ఆవరణలో బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లా కేంద్రం నుంచి గిరిజన ప్రాంతాలు, పల్లెలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేలా కొత్త సర్వీసులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అప్పుల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలోకి రావడం సంతోషకరమన్నారు. ఆర్టీసీ డీఎం శివప్రసాద్ మాట్లాడుతూ.. మహబూబాబాద్ డిపో నుంచి రామగుండాల–ఇల్లందు, గూడూరు–ఊట్ల–మట్టెవాడ, ఏటూరునాగారానికి కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, ఆర్టీసీలో నిరంతరం ప్రయాణించే మహిళా ప్రయాణిలను సన్మానించారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్‌చందర్‌రెడ్డి, పోతురాజు రాజు, చెన్నూరి విజయలక్ష్మి, భూక్య లక్ష్మి, విజయ, ఎడ్ల రమేష్, పద్మం ప్రవీ ణ్, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.