
వ్యవసాయ భూమికి బాట కోసం రైతు వినూత్న నిరసన
● పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో అర్ధనగ్న స్నానం
పాలకుర్తి టౌన్ : తన వ్యవసాయ భూమికి దారి లేకుండా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ రైతు రోడ్డుపై అర్ధనగ్న స్నానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన రైతు భూమండ్ల పెద్దపురానికి గ్రామంలోని కోమటికుంట, బ్రాహ్మణకుంట పక్కన సొంత వ్యవసాయ భూమి ఉంది. ఈ కుంటల దారినుంచే ఆ భూమికి వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల కొందరు రైతులు ఆ కుంటలను కబ్జా చేశారు. దీంతో తన వ్యవసాయ భూమికి వెళ్లేందుకు బాట లేకుండా పోయింది. ఆందోళన చెందిన రైతు పెద్దపురం గతంలో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో అర్ధనగ్నంతో స్నానం చేసి నిరసన తెలిపాడు. తన వ్యవసాయ భూమి వద్దకు బాట ఏర్పాటు చేయాలని అధికారులను కోరాడు. అనుమతి లేకుండా నిరసన తెలపవద్దని చెప్పి అతడిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు.