
ఉజ్వల భవితకు ‘నవోదయం’
ఖిలా వరంగల్ : వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–2027 విద్యా సంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత గల ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈవిద్యాలయంలో సీటు లభిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన బోధన అందుతుంది. చక్కని ప్రణాళికతో చదివి పరీక్షను రాస్తే నవోదయలో ప్రవేశం సులభమని ప్రిన్సిపాల్ పూర్ణిమ తెలిపారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యం..
మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 80 సీట్లు ఉంటాయి. వీటిలో 75 శాతం గ్రామీణ, 25 శాతం నగర, పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ అమలు చేస్తారు. మొత్తం సీట్లలో బాలికలకు 1/3 వంతు సీట్లు కేటాయిస్తారు. పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. అర్హత గల విద్యార్థులు ఈనెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నవోదయ అధికారులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పని సరి..
దరఖాస్తు సమయంలో చాలా మంది విద్యార్థులు తప్పులు చేస్తుంటారు. విద్యార్థి గ్రామం ఏ నవోదయ విద్యాలయ పరిధి, బ్లాక్ పరిధిలోకి వస్తుంది అన్న అంశాలను వెబ్ సైట్‌లో పొందు పరిచిన వివరాలు పరిశీలించుకోవాలి. అది తెలియకుండా నచ్చిన బ్లాకును ఎంచుకుంటే సీటు కోల్పోవాల్సి వస్తుంది. కొంత మంది విద్యార్థులు గ్రామీణ, నగర, పట్టణాన్ని ఎంపిక చేసుకునే విషయంలో తప్పులు చేస్తుంటారు. నగరం, పట్టణం అయితే నగరం, పట్టణం అని, గ్రామం అయితే గ్రామం అని ఎంచుకోవాలి. లేని పక్షంలో సీటును కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష..
ఈ ఏడాది డిసెంబర్ 13వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అబ్జెక్టివ్ విధానంలో రెండు గంటల పాటు పరీక్ష ఉంటుంది. ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదివి ఉండాలి. ఐదో తరగతి తప్పని సరిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చదివిన వారు అర్హులు. విద్యార్థులు 2014, మే 1 నుంచి 2016, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. పరీక్ష మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ విభాగాల నుంచి 100 మార్కులకు గాను 80 అబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో 40 ప్రశ్నలు.. వీటికి 50 మార్కులు ఉంటాయి. అర్ధమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్‌లలో ఒక్కో దానికి 20 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో విభాగానికి 25 మార్కుల చొప్పున 50 మార్కులు కేటాయించారు. మెంటల్ ఎబిలిటీ టెస్టుకు గంట, అర్థమెటిక్ అరగంట, లాంగ్వేజ్ టెస్టుకు అరగంట చొప్పున సమయం కేటాయించనున్నారు.
2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు
ఉమ్మడి జిల్లాలో 80 సీట్లు, రిజర్వేషన్లు వర్తింపు
29 వరకు దరఖాస్తుకు గడువు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
2026–27 విద్యా సంవత్సరానికి గాను నవోదయలో 80 సీట్లలో ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈనెల 29వ తేదీతో గడువు ముగియనుంది. విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులకు ఉజ్వల భవితను అందించే చక్కని వేదిక జవహర్ నవోదయ విద్యాలయం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నాం. – పూర్ణిమ, నవోదయ ప్రిన్సిపాల్, మామునూరు