
తెలంగాణ ఉద్యమ దివిటీ.. దాశరథి
నిజాంను ధిక్కరించిన ధీశాలి నేడు దాశరథి కృష్ణమాచార్యుల జయంతి
చిన్నగూడూరు : నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి..తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’ తో తుడిచి నైజాం రాజులను ఎదిరించిన తెలంగాణ ఉద్యమ దివిటీ దాశరథి కృష్ణమాచార్యులు. నిజాంల పాలన, పెత్తందార్ల పోకడలపై తన అక్షరాన్ని అగ్నిధారగా, పద్యమే పదునైన ఆయుధంగా మలిచి రుద్రవీణలు మోగించి తెలంగాణ ప్రజలను మేల్కొలిపిన రథసారథి దాశరథి. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో వెంకటాచార్యులు–వెంకటమ్మ దంపతులకు 1925, జూలై 22న దాశరథి కృష్ణమాచార్యులు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం చిన్నగూడూరులో ప్రారంభమై ఖమ్మం జిల్లా మధిరలో కొనసాగింది. ఆయన విద్యాభ్యాసం మొత్తం ఉర్దూ భాషలో కొనసాగింది. కాగా అప్పటి పరిస్థితుల దృష్ట్యా వారి కుటుంబం గార్లకు వెళ్లింది. అక్కడే ఉన్నత విద్యను పూర్తి చేశారు. పెత్తందార్ల ఆగడాలను అరికట్టేందుకు రచనలపై మక్కువ పెంచుకుని తన కవితల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేశారు. నిజాం రాజులను ఎదిరించి జైలు జీవితం అనుభవించారు. దాశరథిని జైలులో బంధిస్తే జైలు గోడలపై నిజాంకు వ్యతిరేకంగా ‘ఓ నిజాం పిశాచమా.. కానరాడు, నిన్నుబోలిన రాజు మాకెన్నడని’, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కవితలు రాసి ప్రపంచానికే వెలుగెత్తి చాటిన మహనీయుడు దాశరథి. నిజాం పాలకుల చేతిలో దోపిడీకి గురై సమస్యలతో సతమవుతున్న తెలంగాణ ప్రాంత ప్రజల్లో తన రచనలతో మార్పు తెచ్చిన చైతన్య శీలి దాశరథి.
పోలీసు చర్య అనంతరం జైలు నుంచి దాశరథి విడుదలయ్యారు. చివరికి 1987, నవంబర్ 5న ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తన రచనలు ప్రతి గొంతుకను పిడికిలెత్తి నినదించేలా చేశాయి. ఆయన రచించిన పాటలు, రచనలు, ప్రేరణ యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మండల కేంద్రంలోని దాశరథి కృష్ణమాచార్యులు విగ్రహం వద్ద నేడు దాశరథి జయంతి వేడుకలను జరుపుకోనున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
గేయాలు, రచనలు..
సినీ గేయ రచయితగా 124 చిత్రాలకు వందల గీతాలు, కవితలు, ఎన్నో రచనలు చేశారు. ఆయన రాసిన సినిమా పాటలు ‘కన్నయ్యా నల్లని కన్నయ్యా’, ‘ఖుషి ఖుషిగా నవ్వుతూ’, ‘ఆవేశం రావాలి ఆవేదన కావాలి’, ‘ననుపాలింపగ నడచి’.. ఇలా ప్రతీపాట ఓ పూలచెండు పరిమళం. ఆయన రాసిన ప్రముఖ గేయం ‘ఆ చల్లని సముద్ర గర్భం’ అనే గీతంలో ఆయన లేవన్తెతిన ప్రశ్నలు దశాబ్దాలు గడిచినా.. ప్రశ్నలుగానే మిగిలిపోవటం పాలకుల చేతకానితనమేమో.. అంతటి ఆయన కవిత్వం అజరామరం. అగ్నిధారలతో కురిపించిన ఆయన కవిత్వాలు ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకం అయ్యాయి.

తెలంగాణ ఉద్యమ దివిటీ.. దాశరథి