
భర్త వద్దు.. ప్రియుడే కావాలి
వేలేరు : నలుగురు పిల్లల తల్లి (ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు).. తనకు భర్త వద్దు.. ప్రియుడే కావాలని పంచాయితీ పెద్దలకు చెప్పడంతో వారు ఆమె ఇష్టం ప్రకారం ప్రియుడుతోనే పంపించిన ఘటన మండలంలోని షోడాషపల్లి శివారు పిట్టలగూడెంలో ఇటీవల జరిగింది. భర్త కాలియ శంకర్ తెలిపిన కథనం ప్రకారం.. తనకు చంద్రమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితం లోక్యాతండా గ్రామ పంచాయతీ శివారు వేపలగడ్డ తండాకు చెందిన అజ్మీరా రాజుతో చంద్రమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడు నెలల క్రితం చంద్రమ్మ, రాజు కలిసి పారిపోగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరిని పట్టుకొచ్చారు. అనంతరం ఇరు కుటుంబాలు పెద్దలు పంచాయితీలో మాట్లాడుకుంటామని పోలీసులకు చెప్పారు. దీంతో కులపెద్దలు చంద్రమ్మను తన తల్లిగారి గ్రామమైన చిల్పూరు మండలం వెంకటాద్రిపేటకు పంపించారు. అయితే మళ్లీ చంద్రమ్మకు రాజు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకువెళ్లాడు. వారంక్రితం రాజు, చంద్రమ్మ వేపలగడ్డ తండాకు వచ్చారనే విషయం తెలుసుకున్న భర్త శంకర్ కుటుంబ సభ్యులు తండాకు వెళ్లి రాజును, చంద్రమ్మను చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గొడవ జరుగకుండా నిలువరించారు. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం చంద్రమ్మ రాజుతోనే ఉంటానని కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పి అతడితోనే వెళ్లిపోయింది. తనకు తన భార్య కావాలని, తల్లి కోసం పిల్లలు ఏడుస్తున్నారని భార్యను తనకు అప్పగించాలని భర్త శంకర్ పోలీసులను వేడుకున్నాడు.
వివాహిత ఇష్టం మేరకు ప్రియుడితో పంపిన కులపెద్దలు
తన భార్యను అప్పగించాలని భర్త శంకర్ వేడుకోలు