
రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
మామునూరు : రాజకీయ చైతన్య పోరాటాలకు భారతీయ జనతా పార్టీ జిల్లా, మండల అధ్యక్షులు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ్ కమిటీ కన్వీనర్ ఓ.శ్రీనివాస్‌రెడ్డి కోరారు. బీజేపీ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఈనెల 30, 31వ తేదీల్లో జరిగే జిల్లా, మండల అధ్యక్షుల ప్రశిక్షణ్ తరగతుల శిబిరం ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రశిక్షణ్ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, బి.శేఖర్, క్రాంతి కిరణ్ హాజరయ్యారు. జిల్లా, రాష్ట్ర నాయకులతో కలిసి సాధికారత, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన ప్రణాళికలపై మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను పేద, మధ్యతరగతి ప్రజలకు చేరే వేసే విధంగా కృషి చేయాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం సాధించే దిశగా బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
30, 31 తేదీల్లో బొల్లికుంట వాగ్దేవి కళాశాలలో ప్రశిక్షణ్ తరగతులు
బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ్ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి