
మీ అన్న ఎక్కడ? అంటూ.. తమ్ముడిపై దాడి
● పోలీసులకు ఫిర్యాదు
గూడూరు: అన్నపై కోపంతో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు తమ్ముడిపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని కొల్లాపురం శివారు ఇప్పల్‌తండా చెరువు కట్టపై సోమవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పల్‌తండాకు చెందిన ధరావత్ హక్య, కాంతిలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివాజి కలకత్తాలోని ఖరగ్‌పూర్‌లో ఐఐటీ చదువుతున్నాడు. రెండో కుమారుడు సాయి మానుకోటలోని నలంద కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మధ్యాహ్నం తండా సమీప చెరువు కట్టపై నుంచి వస్తుండగా ఎదురుగా వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సాయిని అడ్డగించారు. ఫొటో చూపి ఈ వ్యక్తి తెలుసా అని అడిగారు. అది చూసిన సాయి, ఆ ఫొటో తన అన్నదే అని సమాధానం ఇచ్చాడు. వెంటనే కోపోద్రిక్తులైన ఆ ముగ్గురు కొన్ని రోజులుగా తిరుగుతున్నాము, మీ అన్న కనిపించడంలేదు, ఎక్కడికెళ్లాడంటూ.. బ్లేడ్, కత్తితో దాడికి పాల్పడ్డారు.సెల్‌ఫోన్ కూడా ధ్వంసం చేశారు. బ్లేడ్ గాయంతో రక్తం కారుతుండగా, మరో వ్యక్తి కత్తితో దాడికి యత్నించాడు. చేయి అడ్డం పెట్టి చాకచక్యంగా వారి నుంచి తప్పించుకొని అరుస్తూ కొద్ది దూరం పరుగెత్తి పడిపోయాడు. తండా సమీపం ఈ సంఘటన జరగడంతో వారు సాయిని వదిలేసి పారిపోయారు. కొద్దిసేపటికి లేచిన అతను తండాలోకి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే తండావాసులు గాలించినా ఎవరూ కనిపించలేదు. అనంతరం గూడూరుకు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులను అడగ్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.