
మత్స్యకారుల ఆదాయం పెంచుతాం
మహబూబాబాద్ అర్బన్: దేశంలో మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి సంపద యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో రూ. 20 వేల కోట్లతో ప్రారంభించిందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సాయి కన్వెన్షన్ హాల్‌లో ఎన్‌ఎఫ్‌డీబీ ఆధ్వర్యంలో ఎస్టీ మత్స్య రైతులకు పలు పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజన మత్స్యకారుల నుంచి అనేక సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. చేపల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం మహిళలకు 90, పురుషులకు 60 శాతం సబ్సిడీ రుణాలను రూ.కోటివరకు అందిస్తుందని, మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బయ్యారం పెద్ద చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని, జిల్లాలో చేప పిల్లల ఉత్పత్తి చెరువులను ప్రోత్సహించేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నారు. జిల్లా పరిధిలో సమస్యపై గిరిజన ప్రజలు దరఖాస్తు రూపంలో అందిస్తే పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజన, గిరిజనేతర మత్స్యకారుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామలన్నారు. సదస్సులో ఎన్‌ఎఫ్‌డీబీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీప సుమన్, జిల్లా మత్స్య శాఖ అధికారి వీరన్న, ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి గొడుగు శ్రీనివాస్, జిల్లా మత్స్య సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేశ్, గిరిజన, గంగపుత్ర, ముదిరాజ్ మత్స్యకారులు పాల్గొన్నారు.