
సరిగమలు పలికేనా?
సాక్షి, మహబూబాబాద్: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరపాలి. ఏటేటా విద్యార్థుల సంఖ్య పెంచాలి. ఇందుకు విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా బోధన జరపాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. కాగా పీఎంశ్రీ పథకంలో ఎంపికై న పాఠశాలల్లో చదువుతోపాటు సంగీత తరగతుల నిర్వహణకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమేరకు జిల్లాలోని పది పాఠశాలలకు మ్యూజిక్ పరికరాలు సరఫరా చేశారు. అయితే సంగీత మాస్టర్ల నియామకంలో జాప్యం జరుగుతోంది. దీంతో పరికరాలు నిరుపయోగంగా మారాయి.
చదువుతో పాటు సంగీతం
జిల్లాలోని 26 ప్రభుత్వ పాఠశాలలను పీఎంశ్రీ పథకంలో ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్స్, క్రీడా పరికరాలు, కంప్యూటర్లు, ట్యాబ్స్, గ్రంథాలయం మొదలైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా నిధులు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు బాలికలకు కరాటే నేర్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మానసిక ప్రశాంతతను కలిగించే సంగీతం కూడా విద్యార్థులకు నేర్పించాలనే ఆలోచనతో జిల్లాలోని మరిపెడ, నెల్లికుదురు, చిల్కోడు(డోర్నకల్), గుర్తూరు(తొర్రూరు) తెలంగాణ మోడల్ సూల్స్, పొనుగోడు(గూడూరు), తొర్రూరు, దంతాలపల్లి, నర్సింహులపేట, మహబూబాబాద్ బాలికల ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలలకు సంగీత పరికరాలు డోలక్, తబలాలు, వయోలిన్, హార్మోనియం పరికరాలు సరఫరా చేశారు. ఈ పరికరాల ద్వారా సంగీతంలోని బేసిక్స్ సరిగమపదనిసలు నేర్చుకోవడం, పాఠాలకు అనుగుంగా వాయిద్యాలు వాయించేలా విద్యార్థులకు నేర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర స్థాయిలో నిర్ణయం
విద్యార్థులకు చదువుతో పాటు వారివారి అభిరుచులకు అనుగుణంగా క్రీడలు, సంగీతం, పరిశోధనలు మొదలైన రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఆయా రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఏర్పాటు చేసిన పీఎంశ్రీ పాఠశాలల్లో సంగీతం నేర్పించడం కోసం పరికరాలు సరఫరా చేశారు. మాస్టర్లను నియమించే విషయంపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. త్వరలో నియామకం ఉంటుంది.
– రవీందర్ రెడ్డి, డీఈఓ
జిల్లాలో 10 పీఎంశ్రీ పాఠశాలలకు సంగీత పరికరాల సరఫరా
టీచర్ల నియామకంలో జాప్యం
మూలనపడిన మెటీరియల్
విద్యార్థులకు తప్పని ఎదురుచూపులు

సరిగమలు పలికేనా?