వడ్డీ బకాయిలు విడుదల | - | Sakshi
Sakshi News home page

వడ్డీ బకాయిలు విడుదల

Jul 21 2025 8:11 AM | Updated on Jul 21 2025 8:11 AM

వడ్డీ బకాయిలు విడుదల

వడ్డీ బకాయిలు విడుదల

గీసుకొండ: బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకున్న సెర్ప్‌ పొదుపు సంఘాల మహిళలకు రెండు నెలల వడ్డీ బకాయిలు మంజూరయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళల అభ్యున్నతికి పలు కార్యక్రమాలను చేపడుతుండగా తాజాగా వడ్డీ బకాయిల చెల్లింపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు వడ్డీ బకాయిలను ప్రభుత్వం ఆయా సంఘాల ఖాతాల్లో జమచేసింది. బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో సకాలంలో వడ్డీ బకాయిలు విడుదల కాకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బందులు పడ్డారు. 2019 నుంచి 2022 వరకు మూడేళ్ల వడ్డీ నిధులు మంజూరు చేయలేదు.

విడతల వారీగా చెల్లింపులు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2023–24 సంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల బకాయిలను కొన్ని నెలల క్రితం విడుదల చేసింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్‌ నుంచి 2025 జనవరి వరకు పది నెలల వడ్డీ బకాయిలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల్లోని 48,717 సంఘాలకు రూ.92.74 కోట్ల బకాయిలను విడుదల చేసింది. అలాగే, ఇటీవల ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు సంబంధించి ఎస్‌హెచ్‌జీలు 50,372 ఉండగా వారికి వడ్డీ కింద రూ.20.27 కోట్లను మంజూరు చేయడంతో పొదుపు సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్వయం ఉపాధికి ఊతం..

మహిళా సంఘాల్లోని సభ్యులు బ్యాంకు లింకేజీ కింద తీసుకున్న వడ్డీ లేని రుణాల(వీఎల్‌ఆర్‌)తో ఆర్థికంగా ఎదగటంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పలువురు చిన్న తరహా పరిశ్రమలు, యూనిట్లను నెలకొల్పుతున్నారు. క్యాంటీన్ల ఏర్పాటు, పెరటికోళ్ల పెంపకం, గేదెల పోషణ, కిరాణం, క్లాత్‌స్టోర్లు, టైలరింగ్‌, సానిటరీ న్యాప్కిన్‌ల తయారీ తదితరాలను ఎంచుకుని ఆదాయం పొందుతూ చిన్నపాటి పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. అలాటి వారికి వడ్డీ బకాయిలను సకాలంలో అందిస్తే మరింత ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

పాత బకాయిల చెల్లింపు ఊసేలేదు..

ఇది ఇలా ఉండగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు అలాగే పేరుకుపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన హయాం నుంచి వడ్డీ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తూ వస్తోంది. అయితే గత బీఆర్‌ఎస్‌ సర్కారు కాలంలో పేరుకుపోయిన భారీ మొత్తంలోని బకాయిల గురించి ఎవరూ ఊసెత్తడం లేదు. అటు అధికారులు, ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో అయోమయం నెలకొంది.

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు విడుదలైన వడ్డీ బకాయిలు

జిల్లా పేరు లబ్ధిపొందిన వచ్చిన మొత్తం

సంఘాలు (రూ.కోట్లలో)

వరంగల్‌ 9,669 4.32

హనుమకొండ 8,600 3.86

జనగామ 9,216 3.41

మహబూబాబాద్‌ 11,552 4.51

ములుగు 5,308 1.92

జయశంకర్‌ భూపాలపల్లి 6,027 2.25

ఎస్‌హెచ్‌జీలకు రెండు నెలల వడ్డీని మంజూరు చేసిన ప్రభుత్వం

ఉమ్మడి జిల్లాలో 50,372 సంఘాలు

రూ.20.27 కోట్లు పొదుపు సంఘాల ఖాతాల్లో జమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement