
భక్తజనంతో పులకించిన హేమాచల క్షేత్రం
మంగపేట : మండలంలోని మల్లూరు శ్రీహేమాచలక్షేత్రం ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాల నుంచి స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో హేమాచలక్షేత్రం పులకించింది. ఆది, సోమవారాలు రెండు రోజులు సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఏజెన్సీలోని లక్నవరం, బొగత తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. రామప్ప, మేడారం సమ్మక్క– సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో భారీగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో సహజ సిద్ధంగా వెలిసిన చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అర్చకులు పవన్‌కుమార్ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిల తైలాభిషేకం పూజలు జరిపించి నూతన పట్టువస్త్రాలతో అలంకరించి కై ంకర్యాదులు నిర్వహించారు. మూడు గంటల పాటు వేచి ఉండి మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభూ స్వామవారి అభిషేక పూజలో పాల్గొని ఆలయ చరిత్ర, స్వామివారి ప్రత్యేకతను తెలుసుకుని పులకించారు. అనంతరం సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చిన దంపతులతో పాటు స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు. భక్తుల గోత్రనామాలతో పూజారులు ప్రత్యేక అర్చనలు జరిపించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వాచ్‌టవర్ పైనుంచి దట్టమైన అటవీ ప్రాంతంలోని కనుచూపు మేర కనిపించే అందమైన ప్రకృతి అందాలను వీక్షించి సెల్ఫీలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఈఓ సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, రికార్డు అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, సిబ్బంది తదితరులు చర్యలు తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు

భక్తజనంతో పులకించిన హేమాచల క్షేత్రం