మరిపెడ రూరల్: మరిపెడ మండలం వీరారం రెవెన్యూ పరిధిలోని అజ్మీరాతండా గ్రామ పంచాయతీ జీన్యతండా శివారులో ఆత్మరక్షణలో భాగంగా ఓ కొండ చిలువను ఆదివారం స్థానికులు చంపేశారు. తండా శివారులో కొందరు జీవాల పెంపకందారులు మేకలు మేపుతున్న క్రమంలో చెట్ల పొదల్లో నుంచి వచ్చిన పెద్ద కొండచిలువ ఓ మేకను పట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా మేకలన్ని చిందరవందర పరుగెత్తాయి. దీంతో కొండ చిలువను గమనించిన జీవాల పెంపకందారులు దాన్ని చంపేశారు. ఈ కొండ చిలువ సుమారు 10 ఫీట్ల పొడవు ఉన్నట్లు మేకల కాపరులు తెలిపారు.
శిథిలావస్థలో కంకరబోడ్ సంపు
మహబూబాబాద్: కంకరబోడ్ ప్రాంతంలో ఉన్న సంపుతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు కూలిపోతుందోనని భయపడుతున్నారు. సంపునకు సంబంధించిన స్లాబ్ ఇప్పటికే చాలాభాగం ఊడి పడిపోయింది. ఎవరైనా తెలియక ఆసంపు స్లాబ్‌పైకి వెళ్తే అందులో పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆ సంపును ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల క్రితం ఈ సంపును నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఈ సంపు నుంచి పలు కాలనీలకు నీటిని సరఫరా చేసే వారు.. కానీ, మిషన్‌భగీరథ పథకం ప్రారంభించి నీటిని సరఫరా చేస్తున్నప్పటి నుంచి ఈ సంపును ఉపయోగించడంలేదని స్థానికులు తెలిపారు. ఈ సంపు పక్కనే పంపు హౌజ్ రూం కూడా ఉంది. దానిని తాగు నీరు సరఫరా చేసే సిబ్బంది స్టోర్ రూంగా ఉపయోగిస్తున్నారు. సంపు చుట్టు పరిసరాలు కూడా అపరిశుభ్రంగా మారి పందులు సంచరిస్తున్నాయి. ఆ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలు, పిల్లలు తెలియక సంపు స్లాబ్ ఎక్కితే దానిలో పడే ప్రమాదం ఉందని వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
రైతుల పాదయాత్రను విమర్శించడం మూర్ఖత్వం
పెద్దవంగర: రైతుల కోసం చేపట్టిన పాదయాత్రను కూడా వక్రీకరిస్తున్నారని, కాలువలు ఎండిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దయాకర్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతోందని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని రోజుల్లో నీరు వదులుతారో ప్రభుత్వం స్పష్టం చేయాలని, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మహాధర్నా నిర్వహించకతప్పదన్నారు. రెండేళ్లుగా రైతులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో దేవాదులు, ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఏడాదంతా నీళ్లు అందేలా చూశామని గుర్తు చేశారు. అనంతరం చిట్యాల, బొమ్మకల్లు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థాన మాజీ చైర్మన్ రామచంద్రయ్య శర్మ, కేతిరెడ్డి సోమనర్సింహరెడ్డి పాల్గొన్నారు.
బొగత వద్ద పర్యాటకుల సందడి
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం లోని బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు కావడంతో పర్యాటకులు భారీసంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలు చూసి ఫిదా అయ్యారు. జలదారలను వీక్షించడంతో పాటు సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. కొలనులో స్నానాలు చేయడంతో పాటు ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
కొండ చిలువ హతం
కొండ చిలువ హతం