
విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
● విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
● కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌తో రోడ్డెక్కిన అన్నదాతలు
నెల్లికుదురు: విద్యుత్ అంతరాయంతో నానా అవస్థలు పడుతున్నా.. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలంలోని పార్వతమ్మగూడెం రైతులు కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట ఆదివారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వరినాట్లు వేసేందుకు పొలం సిద్ధం చేసుకునే క్రమంలో వారం రోజలుగా విద్యుత్ ట్రా న్స్‌ఫార్మర్ కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేయించినా మళ్లీ కాలిపోవడంతో అవస్థలు పడుతుంటే విద్యుత్ అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వాలని, ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని బైఠాయించారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌కు రెండు రోజల్లో మరమ్మతులు చేపడుతామని విద్యుత్ అధికారులు హామీ ఇచ్చినప్పటికీ.. మరమ్మతులు వద్దని నూతన ట్రాన్స్ ఫార్మర్ కావాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సోమిరెడ్డి, వీరారెడ్డి, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి, నాగయ్య, సతీష్, కొమురయ్య పాల్గొన్నారు.