
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
గంగారం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని దుబ్బగూడెం, కామారం, మర్రిగూడెం, కోమట్లగూడెం, గంగారం గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రుల రికార్డులను పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంతాల్లో నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎవరికై నా మలేరియా, డెంగీ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే చికిత్స అందించాలన్నారు. 30 సంవత్సరాలు దాటిన వారందరికీ రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ జరిగితే క్రమం తప్పకుండా మందులు అందించాలన్నారు. కార్యక్రమంలో గంగారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ప్రత్యూష, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, ఆరోగ్య విద్యాబోధకులు కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, సూపర్‌వైజర్ రత్నకుమారి, స్థానిక హెచ్‌పీలు, ఆరోగ్య కార్యకరక్తలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.