
జోధ్‌పూర్ వ్యవసాయ మార్కెట్ సందర్శన
వరంగల్ చౌరస్తా: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణ రైతు సంఘం ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. జోధ్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి రాంసింగ్ సిసోడియా, పండ్లు, కూరగాయల మార్కెట్ సెక్రటరీ దుర్గారామ్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజేందర్ పరివార్, కార్యదర్శి ధర్మేందర్ బండారి, కార్మిక నాయకులు సకూర్ ఘోరీతో సంఘం జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్ రావు, ప్రతినిధులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అక్కడ రైతుల నుంచి పంట దిగుమతి చార్జీలు మినహా ఎలాంటి మార్కెట్ చార్జీలు వసూలు చేయడం లేదని, మార్కెట్ సెస్ రూ.100కు 1.50 రూపాయలు వసూలు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్మిక చార్జీలు నూటికి 3.60 రూపాయలు పంట కొనుగోలుదారుడు చెల్లిస్తాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోర్తాల చందర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లలో పంటలను విక్రయించే కమిషన్ ఏజెంట్లు అదనంగా రైతుల నుంచి కమిషన్, మునిం, దానం, ధర్మం కూటుకు కిలో పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని వ్యవసాయ మార్కెట్ చట్టాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ చట్టాలను సవరించాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు సంగతి సాంబయ్య, చంద్రశేఖర్, మాదం తిరుపతి, సందెపోగు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.