
ఆర్డినెన్స్ పేరుతో ప్రభుత్వం కాలయాపన
మహబూబాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు విషయంలో ఆర్డినెన్స్ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ప్రజలు గమనించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ క్యాంపు కార్యాలయంలో యువగర్జన సదస్సు నిర్వహించారు. సత్యవతిరాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. కాంగ్రెస్‌కు దోచుకోవడం.. దాచుకోవడం తప్ప పరిపాలనపై పట్టు లేదన్నారు. మానుకోటకు ఆరుగురు మంత్రులు వచ్చి విమర్శలు చేశారే తప్ప చేసిందేమి లేదన్నారు. మానుకోట రూపురేఖలు మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌దే అన్నా రు. ప్రతీ గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో యువత పాత్ర కీలకమన్నారు. బయ్యారం మండలంలో ఊసరవెల్లి రాజకీయం చేసే నాయకులు మాజీ సీఎం కేసీఆర్ శవయాత్ర చేయడం దారుణమని, రాబోయే రోజుల్లో ఆ యాత్ర చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. మంత్రి సీతక్క అంటే గౌరవం ఉందని, అనవసరంగా శాపనార్థాలు పెట్టవద్దని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు నాయిని రంజిత్, లూనావత్ అశోక్, యాళ్ల మురళీధర్‌రెడ్డి, సుదగాని మురళి, ఆవుల వెంకన్న, ఉప్పలయ్య, దాము, ఎన్.వెంకన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్