
ఒకరి వెంట ఒకరు
తీరని
విషాదం..
జనగామ: తల్లి, కొడుకు ఒకేరోజు ఒకరి వెంట ఒకరు తనువుచాలించారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చారబుడ్డి దయాకర్‌రెడ్డి(55), తల్లి అహల్యాదేవి(85) గిర్నిగడ్డలో నివాసముంటున్నారు. దయాకర్‌రెడ్డికి ఇద్దరు అన్నలు ఉన్నారు. ఇందులో ఓ సోదరుడు మృతి చెందగా, రెండో సోదరుడు వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తల్లి బాగోగులు చూసుకునేందుకు దయాకర్‌రెడ్డి జనగామలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అహల్యాదేవిపై కోతులు దాడులు చేయడంతో కిందపడి తీవ్రంగా గాయపడింది. దీంతో వెన్నుముక ఆపరేషన్ చేయించాడు. ఇదే సమయంలో దయాకర్‌రెడ్డికి కూడా వెన్ను నొప్పి సమస్య తీవ్ర కావడంతో ఆపరేషన్ చేయించుకుని కోలుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పని మనిషి బయటకు వెళ్లిన తర్వాత రాగిజావ తయారు చేసి తల్లికి ఇచ్చి తానూ తాగాడు. అనంతరం కొడుకు దయాకర్‌రెడ్డి ఇంటి వెనుక కుర్చీలో, తల్లి అహల్యాదేవి మంచం పక్కన చనిపోయి ఉన్నారు. తల్లి తల కింద నుంచి రక్తం మరకలు ఉన్నాయి. రాగి జావలో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు, పలువురు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి, తమ్ముడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారి మృతిపై ఎలాంటి అనుమానం లేదని సోదరుడు వాసుదేవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ చేతన్ నితిన్, సీఐ దామోదర్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని తల్లి, కొడుకు మృతికి గల కారణాలపై ఆధారాలు సేకరించారు. కాగా, దయాకర్‌రెడ్డి, ఆయన తల్లి అహల్యాదేవి మరణ వార్త తెలుసుకున్న అన్ని పార్టీల నాయకులు, స్థానికులు, అభిమానులు అక్కడకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగారాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుల కుటుంబీకులను పరామర్శించిన వారిలో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, వెన్నెం సత్యనిరంజన్‌రెడ్డి, జక్కుల వేణు మాధవ్, వంగాల మల్లారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, గుజ్జుల నారాయణ, తదితరులున్నారు.
తనువు చాలించిన తల్లి, కొడుకు..
జనగామలో ఘటన
మృతుడు మాజీ కౌన్సిలర్
అనారోగ్యంతోనే.. అనుమానం లేదు
పోలీసులకు మృతుడి సోదరుడి ఫిర్యాదు

ఒకరి వెంట ఒకరు