
డేంజర్ దారి!
మరిపెడ రూరల్: జిల్లా మీదుగా వెళ్తున్న 563 జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి గాయాలపాలవ్వడంతో పాటు మృతి చెందుతున్న ఘటనలు ఉన్నాయి. గత శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు వ్యాపించడంతో ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. గుంతను తప్పించబోయి రెండు లారీ లు ఢీకొని ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయినప్పటకీ నేషనల్ హైవే అధికా రులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహిస్తున్నారు.
మరిపెడ మండలం మీదుగా..
జాతీయ రహదారి–563 ఖమ్మం నుంచి జిల్లాలోని మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి, తొర్రూరు మండలాల మీదుగా వరంగల్‌కు వెళ్తోంది. కాగా మరిపెడ మండల పరిధిలో రహదారిపై పలుచోట్ల మీటరు లోతు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. ఈ రహదారిలో ప్రయాణించాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.
పూడ్చినా.. మూణ్నాళ్ల ముచ్చటే..
వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గత మూడు నెలల క్రితం మండల పరిధిలోని హైవేపై ఏర్పడిన గుంతలను తాత్కాలికంగా పూడ్చారు. అయితే వాహనాల రాకపోకల వల్ల మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ఆదివారం ఖమ్మం నుంచి వరంగల్‌కు లోడుతో వెళ్తున్న లారీ గుంతలోనే నిలిచిపోయింది. పది కిలోమీటర్ల రోడ్డు పరిధిలో సుమారు పది చోట్ల గుంతలు ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా గుంతలను పూడ్చి వాహనదారుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.
భయంగా ప్రయాణించాల్సి వస్తోంది..
ఖమ్మం–వరంగల్ హైవే పై ఏర్పడిన గుంతల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది. హైవే అధికారులు ఎప్పటికప్పుడు గుంతలను పూడ్చాలి.
– గుగులోతు దేవేందర్,
ద్విచక్రవాహనదారుడు, రైప్‌సింగ్‌తండా
జాతీయ రహదారిపై గుంతలతో తరచూ ప్రమాదాలు
విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్న
వాహనదారులు
గుంతను తప్పించబోయి
ఇటీవల రెండు లారీలు దగ్ధం
ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ సజీవదహనం
పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు
మరిపెడ మున్సిపాలిటీ పరిధి గణేశ్ వైన్‌షాపు ఎదుట మండలంలోని వీరారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తూ గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
పెట్రోల్ బంకు వద్ద రహదారిపై ఏర్పడిన గుంతను తప్పించబోయి దంట్లకుంటతండాకు చెందిన ఓ ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు.
సోషల్ వెల్ఫేర్ గురుకు పాఠశాల వద్ద ఏర్పడ్డ గుంతలో పడి మరో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు.
అదే గుంత వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్ వేయగా వెనుకాల నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారు గాయాలపాలయ్యారు.
ఇవే కాకుండా నాలుగైదు సంవత్సరాల నుంచి రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు.

డేంజర్ దారి!

డేంజర్ దారి!

డేంజర్ దారి!