
మున్నేరు నీటిని తరలించొద్దు
బయ్యారం: మున్నేరువాగు నీటిని ఈ ప్రాంత రైతుల అవసరాలకు ఇవ్వకుండా, పాలేరు ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బయ్యారంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో మున్నేరు నీటి తరలింపుపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల ఐదున్నర దశాబ్దాల కల అని, గార్ల, బయ్యారం, డోర్నకల్, కురవి, కామేపల్లి మండలాల సాగునీటి అవసరాల కోసం డిజైన్ చేసిన ప్రాజెక్ట్‌ను ప్రస్తుత పాలకులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా వైఎస్.రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు విడుదల చేశారన్నారు. వైఎస్సార్ మరణానంతరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడ ఒక్క ఎకరానికి నీళ్లివ్వకుండా పాలేరుకు నీటిని తరలించుకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. మున్నేరు నీటి రక్షణ కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర నాయకుడు గోపగాని శంకర్‌రావు, ఎన్‌డీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, టీవీవీ రాష్ట్ర నాయకుడు విశ్వ, సీపీఎం జిల్లా నాయకుడు మండ రాజన్న, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాత గణేశ్, బి.సూర్యనారాయణ, బాబూరావు, భీముడు, నందగిరి వెంకటేశ్వర్లు, జి.సక్రు, ఏనుగుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య