
తల్లికి నిప్పంటించిన కొడుకు అరెస్ట్
● వివరాలు వెల్లడించిన పోలీసులు
సంగెం: తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సంగెం పీఎస్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పర్వతగిరి సీఐ రాజ్‌గోపాల్, సంగెం ఎస్సై నరేశ్.. నిందితుడి అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. డబ్బు, ఆస్తి కోసం మండలంలోని కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద(60)పై తన కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆమె 90 శాతానికిపైగా కాలిన గాయాలతో ఎంజీఎంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషయం విధితమే. సోమవారం మధ్యాహ్నం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలో నిందితుడు ముత్తినేని సతీశ్ పారిపోతుండగా పట్టుకుని విచారించారు. వీరికున్న భూమిలో 4 ఎకరాలు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో, మరో ఎకరం తండ్రి సాంబయ్య పేర ఉంది. పరిహారంగా రూ. 40 లక్షలు వచ్చాయి. వాటిలో రూ. 30 లక్షలు సతీశ్‌కు ఇవ్వగా వాటితో బుధరావుపేటలో రెండున్నర ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. మిగతా డబ్బులో కొంత మరోసారి కుమారుడికి ఇవ్వగా తండ్రి సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3,50,000 బ్యాంకు డిపాజిట్ చేసుకున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బు, ఎకరం భూమి తనకు ఇవ్వకుండా అక్క స్వరూపకు ఇస్తారా అని తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో కిరాయికి ఉంటున్న సతీశ్.. తల్లిపై కక్ష పెంచుకుని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. శనివారం రాత్రి సంగెంలోని ఓ బంక్‌లో పెట్రోల్ కొనుగోలు చేసి అర్ధరాత్రి కుంటపల్లికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చి ‘నీవు ఉన్నన్ని రోజులు డబ్బులు, భూమి ఇవ్వవు.. నీవు చస్తే నాకు వస్తాయి’ అని తల్లి వినోదపై పెట్రోల్ చల్లి నిప్పంటించి పరారయ్యాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని, మంగళవారం రిమాండ్‌కు తరలిస్తామని సీఐ, ఎస్సై తెలిపారు.