
లెక్కలన్నీ తేల్చుతారు ..
నేడు చార్టెడ్ అకౌంటెంట్ డే
హన్మకొండ చౌరస్తా: ఏడాదిలో చేసిన లక్షలు, కోట్ల రూపాయల ఖర్చు, జమలకు సంబంధించిన ప్రతీ పైసా లెక్క తేల్చుతారు. బడా వ్యాపారుల నుంచి మొదలు.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోనూ వీరిదే ముఖ్య భూమిక. లాభాల నుంచి నష్టాల వరకు ప్రతి అంశానికి ఓ లెక్క.. ఆ లెక్కకు ఓ రికార్డును సరిచేస్తారు. వారు లేనిది ఎంత పెద్ద సంస్థ అయినా నడవదంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా.. చార్టెడ్‌అకౌంటెంట్లు. ప్రస్తుతం ప్రతీ సంస్థకు ఓ సీఏ తప్పనిసరి అయ్యింది. దీంతో సీఏ కోర్సుకు డిమాండ్ పెరిగింది. సీఏ పూర్తి చేస్తే ఉపాధి అవకాశాలకు కొరత లేదనే చెప్పొచ్చు. నేడు చార్టెడ్ అకౌంటెంట్ల దినోత్సవ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఆర్థిక మోసాలను కనిపెట్టడంలో దిట్ట..
కంపెనీ ప్రాజెక్టు నివేదికలు తయారుచేయడం.. ఖర్చులు నియంత్రించడం.. ఆర్థిక మోసాలను కనిపెట్టి వాటి నివారణకు చర్యలు సూచించడం సీఏ బాధ్యత. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 250 మంది చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు.
పెరుగుతున్న ఆదరణ..
సీఏగా గుర్తింపు పొందిన వారికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే సీఏకు రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
సీఏ కోర్సు వివరాలు ..
ఇంటర్మీడియట్ పూర్తయ్యాక సీఏ ఫౌండేషన్‌కు రిజిస్టర్డ్ అవ్వాలి. డిగ్రీ పూర్తి చేసిన వారు ఫౌండేషన్ అవసరం లేకుండానే నేరుగా సీఏకు రిజిస్టర్డ్ కావొచ్చు. అడ్మిషన్ కోసం ముందు ఐసీఏఐ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. సీఏ ఫౌండేషన్ ఇంటర్ తర్వాత మొదటి స్టేజ్‌లో అకౌంటింగ్, ‘లా’, ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇలా నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. 2 నుంచి 3 సంవత్సరాల ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. చివరి స్టేజీలో రెండు గ్రూప్స్, ఆరు పేపర్లు పూర్తి చేయాలి. కోర్సు పూర్తయ్యే వరకు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఐసీఏఐ ద్వారా మెరిట్, నీడ్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ అందుతాయి. కోర్సు పూర్తి చేయడానికి 4–5 సంవత్సరాలు పడుతుంది.
అద్దె భవనంలో ..
దశాబ్ద కాలంగా హనుమకొండ హంటర్‌రోడ్ లోని ట్యాక్స్ బార్ అసోసియేషన్ భవనంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వరంగల్ శాఖ అద్దె భవనంలో కొనసాగుతోంది. అప్పట్లో జిల్లాకు ఐసీఏఐకు సొంత భవనం మంజూరు చేయాలని అసోసియేషన్ బాధ్యులు అప్పటి కలెక్టర్ వాకాటి కరుణను కోరారు. స్పందించిన ఆమె బాలసముద్రంలోని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ పక్కన గల సుమారు ఎకరం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపారు. అందుకు ప్రభుత్వ ధర ప్రకారం ఆయా స్థలానికి చెల్లించేందుకు ఐసీఏఐ సైతం ముందుకొచ్చింది. అంతేకాదు భవన నిర్మాణం కోసం రూ.6 కోట్లు వెచ్చించేందుకు ఐసీఏఐ రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఇంతలో ఏమైందో తెలియదు ఆ ప్రతిపాదనలు మూలకుపడ్డాయి. దీంతో సీఏ కోర్సు చదవడానికి సరైన వసతులు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ విద్యార్థులు హైదరా బాద్, చైన్నె లాంటి మహానగరాలకు వెళ్తున్నారు.
విశ్వసనీయతకు నిలువుటద్దం
వ్యాపారుల లెక్కలన్నీ వీరి గుప్పిట్లోనే..
సీఏ కోర్సుతో ఉన్నత అవకాశాలు

లెక్కలన్నీ తేల్చుతారు ..