
శిథిల భవనం!
మహబూబాబాద్: జిల్లాలో పలు తహసీల్దార్ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉంది. దీంతో అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా మానుకోట తహసీల్దార్ కార్యాలయ భవనం పరిస్థితి మరి దారుణంగా ఉంది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. నూతన భవన నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
నాలుగు కార్యాలయాలు
శిథిలావస్థ భవనాల్లో..
జిల్లాలో 18మండలాలు ఉన్నాయి. కాగా 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6,35,872 మంది జనాభా, 5,61,960 మంది ఓటర్లు, 1,69,556 గృహాలు ఉన్నాయి. కాగా మానుకోట, డోర్నకల్ తహసీల్దార్ కార్యాలయాల భవనాలు పూర్తిగా శిథిలావస్థలో ఉండగా.. కురవి, తొర్రూరు కార్యాలయాల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాగా పెద్దవంగర, దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అలాగే కొత్తగూడ కార్యాలయం ఐటీడీఏకు చెందిన భవనంలో.. గంగారం ఇతర శాఖ భవనంలో, చిన్నగూడూరు కార్యాలయం ఎస్సీ హాస్టల్ భవనంలో కొనసాగుతోంది. ఇటీవల ఏర్పడిన ఇనుగుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం గ్రామ పంచాయతీ భవనంలో, సీరోలు కార్యాలయం పాత పాఠశాల భవనంలో నడుస్తోంది.
ఏడు కార్యాలయాలకే పక్కా భవనాలు..
జిల్లాలోని నెల్లికుదురు, గూడూరు, నర్సింహులపేట, బయ్యారం, గార్ల, కేసముద్రం, మరిపెడ మండలాల తహసీల్దార్ కార్యాలయాలు మాతమ్రే పక్కా భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాల్లో అన్ని సౌకార్యాలు ఉన్నాయి.
నిజాంకాలం నాటి భవనంలో
మానుకోట కార్యాలయం..
మానుకోట తహసీల్దార్ కార్యాలయం నిజాంకాలం నాటి భవనంలో కొనసాగుతోంది. ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. వెనుక భాగంలో ఉన్న పలు గదులు కూలిపోయాయి. వర్షాకాలం నేపథ్యంలో భవనం ఎప్పుడు కూలుతుందోనని అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అందులో కూడా గదుల కొరతతో సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రతిపాదనలకే పరిమితం..
నూతన భవనాల కోసం ఏటా అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారు. కానీ నిధులు మంజూరు కావడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శిథిలావస్థలో ఉన్న భవనాల కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆయా కార్యాలయాల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా ఆ భవనాలను చూసి భయపడుతున్నారు.
శిథిలావస్థలో పలు తహసీల్దార్
కార్యాలయాల భవనాలు
ఇబ్బందులు పడుతున్న
అధికారులు, సిబ్బంది
ప్రతిపాదనలకే పరిమితమైన
నూతన బిల్డింగ్‌లు
అద్దె భవనాల్లో కొనసాగుతున్న
పలు కార్యాలయాలు

శిథిల భవనం!

శిథిల భవనం!