
గుంజేడు ముసలమ్మను దర్శించుకున్న అదనపు కలెక్టర్
కొత్తగూడ: మండలంలోని గుంజేడు ముసలమ్మ తల్లిని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి అర్చన చేశారు. ఆదివాసీ పూజారులు వేద మంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం ఇచ్చారు.
మర్రిగూడెంలో..
గార్ల: మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామిని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు రామాచార్యులు ఆయనను గర్భగుడిలోకి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వీరబ్రహ్మచారిని పంచాయతీ కార్యదర్శులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అజ్మీరా కిషన్, కిశోర్, చక్రధర్, మహేశ్, వెంకటేశ్వర్లు, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
వీరన్న సన్నిధికి
పోటెత్తిన భక్తులు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఎటు చూసిన భక్తుల సందడి నెలకొంది. స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
విద్యుత్ తీగలు సరిచేశారు
కేసముద్రం : మున్సిపలిటీ పరిధి జమలాపురం సమీపంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను ఆ శాఖ సిబ్బంది ఆదివారం సరిచేశారు. ఈ విషయంపై ఈనెల 28న ‘సాక్షి’ దినపత్రికలో ‘చేతులు లేపితే అంతే’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ రాజు విద్యుత్ సిబ్బందితో తీగలను ఎలాంటి ప్రమాదం లేకుండా సరి చేయించారు. రైతులు సాక్షి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
వైభవంగా శాకంబరీ మహోత్సవాలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వైభవంగా కొనసాగుతున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కురుకుల్లా క్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని భేరుండాక్రమంలో అలంకరించి నవరాత్ర విశేషపూజలు నిర్వహించారు.

గుంజేడు ముసలమ్మను దర్శించుకున్న అదనపు కలెక్టర్

గుంజేడు ముసలమ్మను దర్శించుకున్న అదనపు కలెక్టర్