
ప్రభుత్వ బడులను మూసివేయొద్దు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ బడుల మూసివేత విధానాలను మానుకోవాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గురుకుల పాఠశాలల కారణంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంటే.. కొత్త పేర్లతో మరిన్ని గురుకులాలను నెలకొల్పి ప్రభుత్వ బడులను పూర్తిగా మూసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్ దాడి, మరోవైపు సొసైటీ గురుకులాల దాడిని తట్టుకొని విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో నమోదు చేసుకోవడానికి ఉపాధ్యాయులు కష్టపడుతుంటే.. వారి మీద ప్రభుత్వం బురద జల్లే పనులు చేస్తోందని ఆరోపించారు. టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాడానికి పది శాతం ముడుపులు చెల్లించాల్సి వస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీశైలం, ఐలయ్య జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, వెంకట్రాంనర్సయ్య, ఉపేందర్, సాయిబాబు, ఉపేందర్, రవీందర్, కిషన్, రవీందర్‌రెడ్డి, జనార్దన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.