
డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒకరి బలి..
● ట్రాలీ ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం
● అయోధ్య క్రాస్ వద్ద ఘటన
మహబూబాబాద్ రూరల్ : ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. వాహనం నిర్లక్ష్యంగా నడుపుతున్న క్రమంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ఆ ఆటోను ఢీకొని దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ మండలం అయోధ్య క్రాస్ వద్ద చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై వి.దీపిక కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం ముడుపుగల్‌కు చెందిన సుంద రవి (లేట్), రమ దంపతుల పెద్ద కుమారుడు అరుణ్ అలియాస్ టాకిల్ (20) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం తన ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వస్తున్నాడు. అంతకంటే ముందు అయోధ్య గ్రామానికి చెందిన కన్నం విజయ్ తన టాటా ఏస్ ట్రాలీ ఆటోలో ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆటో అయోధ్య క్రాస్ వద్దకు చేరుకోగానే ఇండికేటర్ వేయకుండా వాహనాన్ని అలాగే నడిపాడు. అంతలోనే ఆ వాహనం వెనకే వస్తున్న ద్విచక్రవాహనదారుడు అరుణ్ ఒక్కసారిగా ఆటోను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అరుణ్ ద్విచక్ర వాహనంపైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి ఆటోను అదుపులోకి తీసుకుని అరుణ్ మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం గదికి తరలించారు. మృతుడి బాబాయ్ సంద రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దీపిక తెలిపారు.
ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే..
అరుణ్ ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాలలోపే ఆటోను ఢీకొని దుర్మరణం చెందాడు. దీనిపై గ్రామస్తులు బోరున విలపించారు. అరుణ్ అప్పటిదాకా తమ ముందే కనబడి అంతలోనే కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో ముడుపుగల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండేళ్ల క్రితం తండ్రి రవి అనా రోగ్యంతో మృతిచెందగా కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న పెద్ద కుమారుడు అరుణ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో తల్లి రమ రోదించిన తీరు అందరి హృదయాలను కలచివేసింది.