
సమ్మక్క సాగర్‌కు జలకళ..
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ జలకళ సంతరించుకుంది. కొన్ని రోజుల నుంచి బ్యారేజీలో నీరులేక పోవడంతో బోసిపోయిన గోదావరి.. వారం రోజుల నుంచి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. దీంతో బ్యారేజీలోకి ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు చేరడంతో అధికారులు బ్యారేజీ వద్ద 59 గేట్లలో మూడు గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.81టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ నీటి మట్టం 83 మీటర్లకు గాను 79.50 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. కాగా, దేవాదుల వద్ద ఉన్న చొక్కారావు ఎత్తిపోతల నుంచి రెండు మోటార్ల ద్వారా 494 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నట్లు డీఈ శరత్ బాబు తెలిపారు.
ఎగువ నుంచి బ్యారేజీలోకి
21,500 క్యూసెక్కుల నీరు చేరిక
మూడు గేట్లు ఎత్తి 27,000
క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల