
బడికిపోయినా బతికేటోడు..
నెల్లికుదురు : పాపం చిన్నారి.. బడికి పోయినా బతికేటోడు. వ్యవసాయ బావి దగ్గరికి వెళ్దాం ఈ రోజు పాఠశాలకు వెళ్లకండి అని తండ్రి చెప్పడంతో ముగ్గురు చిన్నారులు ఎగిరి గంతేశారు. తల్లిదండ్రితోపాటు ట్రాక్టర్‌లో వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ తండ్రి వ్యవసాయ భూమి దున్నుతుండగా సరదాగా ముగ్గురు చిన్నారులు ట్రాక్టర్‌పై ఎక్కారు. ఇందులో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటోవేటర్ కిందపడి దుర్మరణం చెందాడు. దీంతో బడికి పోయినా బతికిటోడివి బిడ్డో అంటూ తల్లిదండ్రులు తమ కుమారుడి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇన్‌చార్జ్ ఎస్సై శివరామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జిలుకర ప్రసాద్, స్వర్ణ దంపతులకు కూతురు సౌమ్య, ఇద్దరు కుమారులు సందీప్, వరుణ్(07) ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు, భార్యను ట్రాక్టర్‌పై ఎక్కించుకున్న ప్రసాద్.. తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. అక్కడ ట్రాక్టర్‌పై నుంచి స్వర్ణ దిగింది. పిల్లలు వరుణ్, సౌమ్య, సందీప్ ట్రాక్టర్‌పై కూర్చోపెట్టుకుని తండ్రి వ్యవసాయ భూమి దున్నుతుండగా పిల్లలు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వరుణ్ ట్రాక్టర్ పైనుంచి జారి దున్నుతున్న రోటో వేటర్ కింద పడ్డాడు. దీంతో నాన్న.. తమ్ముడు పడిపోయాడు అని మిగతా ఇద్దరు పిల్లలు అరుస్తుండగా ట్రాక్టర్ నిలిపి తండ్రి వెళ్లి చూడగా అప్పటికే వరుణ్ దుర్మరణం చెందాడు. రోటోవేటర్ కింద పడి ఆ చిన్నారి మృతదేహం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదం తమ కళ్లెదుటే జరుగడంతో ఆ కుటుంబం మొత్తం గుండెలవిసేలా రోదించింది. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జ్ ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. కాగా, వరుణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ట్రాక్టర్ రోటోవేటర్ కిందపడి బాలుడి దుర్మరణం
రాజులకొత్తపల్లిలో ఘటన
మిన్నంటిన కుటుంబీకుల రోదనలు